జనసేన పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజీనామా లేఖ పంపారు. పూర్తిగా ప్రజాసేవకే అంకితం అని చెప్పి... ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వెళ్లటం పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలకు నిదర్శనంగా అభివర్ణించారు. అందుకే తాను పార్టీలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో తన వెంట ఉన్న జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారికి వ్యక్తిగతంగా తాను వెన్నంటి ఉంటానని చెప్పారు.
భాజపా పొత్తుతో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ కూటమిగా ఎదగాలని జనసేన భావిస్తున్న తరుణంలో లక్ష్మీనారాయణ రాజీనామా పెద్ద కుదుపని చెప్పొచ్చు. లక్ష్మీనారాయణ గత సార్వత్రిక ఎన్నికల ముందే జనసేనలో చేరారు. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయినా... చెప్పుకోదగిన ఓట్లు మాత్రం సాధించారు.
ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాలకు కొంచెం దూరమవుతూ వచ్చారు. అయితే విశాఖలో జరిగిన జనసేన లాంగ్ మార్చ్, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రైతు కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీని ఏర్పాటు చేసింది. అందులో లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు. అలాగే పార్టీ కార్యక్రమాలకు సైతం పిలవటం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణ.. జనసేన నుంచి వెళ్లేందుకు కారణమై ఉంటాయని వారంటున్నారు.