వయసు చిన్నదే... లక్ష్యం మాత్రం ఉన్నతమైంది. ఆ బుడ్డోడు చేసిన పని.. అందరికీ స్ఫూర్తిని పంచింది. తల్లిదండ్రుల సహకారంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరు.. అబ్బురపరుస్తోంది. పేరు.. అనిశ్వర్.. పిల్లాడే అయినా. అనితరసాధ్యుడు.
ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. మన తెలుగోడే. చిత్తురు జిల్లాకు చెందిన స్నేహ, అనిల్ దంపతుల కుమారుడు. ఇంగ్లండ్‌లోని వర్రింగ్టన్లో ఆ కుటుంబం స్థిరపడింది. 2016లో.. ఏడాది వయసున్నప్పుడు.. బాదం పౌడర్ తింటూ అనారోగ్యానికి గురయ్యాడు. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే అనీశ్వర్... అదే ఆటతో వైద్యుల కోసం అడుగు ముందుకు వేశాడు. ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొన్నాడు.
తన స్నేహితులతో కలిసి గివ్ ఇండియా పేరుతో సైక్లింగ్ చాలెంజ్ కు శ్రీకారం చుట్టాడు. "లిటిల్ పెడ్లర్స్ అనీష్ అండ్ హిస్ ఫ్రెండ్స్.. 30 డేస్ సైక్లింగ్ ఛాలెంజ్" అంటూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. చిన్నారులందరినీ ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చాడు. తన మాతృదేశానికి విరాళాలు అందించేందుకు అడుగు ముందుకేశాడు.
ఆరుగురు చిన్నారులతో మొదలైన ఈ ఛాలెంజ్.. 8 రోజుల్లోనే 41 మందికి చేరిందని.. ఇంకా 22 రోజుల పాటు సైక్లింగ్ ఛాలెంజ్ కొనసాగుతుందని అనీశ్వర్ తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే లక్షా 70 వేల రూపాయలు సేకరించినట్టు చెప్పారు. లండన్ నుంచి భారత్ కు 23 వేల 700 కిలోమీటర్లు ఉన్న దూరాన్ని.. బ్రిటన్ లోనే.. చిన్నారులందరితో కలిసి సైక్లింగ్ చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఫలితంగా.. మాతృదేశానికి కష్ట కాలంలో అండగా నిలుస్తున్నామన్న సంతృప్తి అనీశ్వర్ తో పాటు తమకూ కలుగుతుందని చెప్పారు.
గతంలోనూ ఇలాగే...
క్రికెట్లో ఎన్ని ఓవర్లు వరకు ఆడగలరు.. ఓ పది.. ఇరవై.. కుదిరితే.. 50 ఓవర్లు. కానీ అనీశ్వర్ మాత్రం 400 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడ్డాడు. అది ఎందుకో తెలుసా...? అలర్జీపై అలుపెరగని పోరు చేసిన ఈ బాలుడు.. తనకు వైద్యం చేసిన వైద్యులకు అండగా నిలవాలనుకున్నాడు. ఏడాది వయసులో ఎదురైన అనారోగ్యానికి.. చికిత్స చేసిన వైద్యుల సంక్షేమం కేసం విరాళాలు సేకరించాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌తో ఈ పని చేశాడు. పది రోజుల పాటు సుమారు 2300 బంతులు ఎదుర్కొని 400 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలబడ్డాడు. 3 లక్షల రూపాయలు సేకరించి వైద్య కళాశాల ట్రస్టుకు అందించాడు. తాజాగా సైక్లింగ్ తో భారత్ కు అండగా నిలబడుతున్నాడు. బుడ్డోడే.. కానీ .. మనసున్నవాడు కదూ..!
ఇదీ చదవండి: