రాజధాని రైతులపోరు ఇవాళ 28వ రోజుకు చేరింది. 144సెక్షన్ నిబంధనలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో రైతులు ఊరట చెందారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు ఇదో చెంపపెట్టని వాళ్లు మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలతో సందడి వాతావరణం నెలకొంటే.. ఈసారి తాము మాత్రం పోరాటమే పంథాగా పండుగ జరుపుకోవాల్సి వచ్చిందని అన్నదాతలు ఆక్షేపించారు.
ఇవాళ కూడ కొనసాగనున్న నిరసనలు
స్థానిక ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయకపోగా మరింత కించపరిచే విధంగా వ్యవహరించడాన్ని రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ పరిణామాలకు అధికార పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. 28వ రోజైన ఇవాళ కూడా మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు నిర్వహించనుండగా వెలగపూడి, కృష్ణాయపాలెంలో 28వ రోజు రిలేనిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయిని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు నిర్వహించి నిరసనలు తెలపనున్నారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే తమ నిరసనలు కొనసాగించనున్నారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతోపాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.
ఇదీ చదవండి : సంక్రాంతి సంబరాలు: నేడు గుడివాడలో పాల్గొననున్న సీఎం