కరోనాతో.. ఖరీఫ్ ఆరంభంలోనే కూలీల కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రంలోని వారూ ఇతర ప్రాంతాలకు పోయే అవకాశం లేదు. దీంతో వరి నాట్ల నుంచే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎకరా నాట్లు వేయడానికి గతంతో పోలిస్తే రూ.500- 800 వరకు పెరిగింది. పత్తి, మిర్చి తదితర మెట్ట పంటలు సాగు చేసే రైతులు కూడా.. కోతలు మొదలైతే కూలీలను ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియడం లేదని పేర్కొంటున్నారు.
ఉత్తరాది కూలీలకు డిమాండ్
పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వందలాది మంది కూలీలు.. అయిదు, పది మంది ముఠాగా ఏర్పడి వరి నాట్లు వేస్తుంటారు. తొలుత గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలో నాట్లు వేసి.. అక్కడ పూర్తయ్యాక రాయలసీమకూ వెళ్లేవారు. మొక్కల మధ్య కచ్చితమైన దూరం పాటిస్తూ, దారి వదులుతూ అత్యంత వేగంగా నాటడం వీరి ప్రత్యేకత. నారు పీకడం నుంచి మోయడం అన్నీ వారే చేసుకుంటారు. సాధారణంగా ఎకరాకు 30 కిలోల విత్తనం అవసరం. వీరు వేసే నాట్లకు సగం విత్తనం సరిపోతుంది. ఈ విధానంలో నాట్లు వేస్తే దిగుబడి కూడా పెరుగుతుందని వ్యవసాయశాఖ చెబుతోంది. అందుకే పశ్చిమ బెంగాల్ నాట్లకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. వీరితోపాటు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల నుంచి కూడా నాట్లు వేయడానికి వచ్చేవారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు వచ్చేందుకు వీరెవరూ సిద్ధంగా లేరని కృష్ణా జిల్లా కోలవెన్ను రైతులు చెప్పారు. వరి నాట్లు వేయడానికి గతంలో ఎకరాకు రూ.3,500 నుంచి రూ.4,500 ఖర్చయ్యేది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల రూ.వెయ్యి వరకు పెరిగింది. మరికొన్ని చోట్ల రూ.500 నుంచి రూ.800 అధికంగా తీసుకుంటున్నారు.
కోతలు మొదలైతే మరింత ఇబ్బందే
పత్తి తీతలు, మిరప కోతలు, వరి నూర్పిళ్లకూ గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ, తెలంగాణలోని నల్గొండ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కూలీలు పనుల కోసం వచ్చేవారు. కొన్ని గ్రామాల్లో స్థానిక జనాభాకు సమానంగా.. కూలీలు వచ్చి అక్కడే రెండు మూడు నెలలపాటు ఉండేవారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వారు వచ్చే అవకాశాలూ తక్కువేనని రైతులు పేర్కొంటున్నారు. గతేడాది మిరప కోతకు కూలి రూ.450 వరకు చేరింది. పత్తి తీయించాలంటే కిలోకు రూ.20 వరకు చెల్లించాల్సి వచ్చింది. కరోనా సమయంలో చివరి కోత మిర్చికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరితీత పత్తి తీయించలేక కొంతమంది పొలాల్లోనే వదిలేశారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి పునరావృతమవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
'కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలి'