ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే కొనేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రకృతి ప్రతికూలతలతో పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గాయి. అరకొరగా చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే తేమ శాతం ఎక్కువగా ఉందని... రంగుమారిన ధాన్యం పరిమితికి మించి ఉందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెనక్కి తిప్పిపంపుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుందామంటే కర్షకుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. రంగు మారిన ధాన్యం కొంటామని సర్కారు ప్రకటించినా దెబ్బతిన్న ధాన్యం శాతం పదికి మించితే తిరస్కరిస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది.
తెలంగాణలోని మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలతోపాటు నెల్లూరు, తూర్పుగోదావరి నుంచి మిల్లర్లు ఏటా జిల్లాకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసేవారు. ఆ రాష్ట్రంలో ఈసారి ధాన్యం దిగుబడులు బాగుండటంతో అక్కడి వ్యాపారులు ఇక్కడకు రావడం లేదు. నెల్లూరు, గోదావరి జిల్లాల వ్యాపారులు ఇక్కడి ధాన్యం నాణ్యతగా లేదని ఒకటి రెండు రోజులు కొనుగోలు చేసి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో బహిరంగమార్కెట్‌లో కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి.
డెల్టా రైతులకు మరింత నష్టం
జిల్లాలో వరికోత యంత్రం ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని డెల్టాలో 76 కిలోల బస్తా రూ.1150 ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ధాన్యం నాణ్యతగా ఉండటంతో బస్తా రూ.1200 వరకు కొంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో అంతకు మించి ధర ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండటం, తుపానుకు ధాన్యం నానడంతో వారం రోజులు ఆరబెట్టినా వరిలో తేమ 10శాతానికి రావడం లేదు. రైతుకు ధాన్యం ఆరబెట్టడానికి అనుకూలమైన పరిస్థితి లేకపోవడం, మరోవైపు రెండో పంటకు పొలం సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం కావడంతో అయినకాడికి పొలంలోనే అమ్ముకుంటున్నారు.
కారణాలు ఎన్నో..
తుపాను తీవ్రతకు పంట నేలవాలడంతో యంత్రం ద్వారా కోతకు రెండు నుంచి రెండున్నర గంటలు పడుతోంది. గంటకు రూ.3వేలు చొప్పున యంత్రానికి అద్దె చెల్లించాల్సి వస్తోంది. రైతు చేతిలో సొమ్ము లేక... వ్యాపారులకు వెంటనే ధాన్యం అమ్మి అద్దె చెల్లిస్తున్నారు.
- ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే భూ యజమాని బ్యాంకు ఖాతాలో సొమ్ము జమవుతుంది. యజమాని కౌలు సొమ్ము తీసుకొని మిగిలితే కౌలుదారునికి ఇస్తున్నారు. రైతు ఖాతాలో సొమ్ము జమ అయిన తర్వాత కౌలు మొత్తం తీసుకుంటే అడిగే అవకాశం ఉండదని కౌలుదారులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి వెనుకడుగు వేస్తున్నారు. కౌలు రైతులు కొనుగోలు కేంద్రాలకు రాకపోవడానికి ఇది కూడా కారణమని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు.
- పంట నేలవాలడంతో యంత్రంతో కోసే క్రమంలో మట్టిపెళ్లలు కూడా ధాన్యంతో పాటు వచ్చి నాణ్యత దెబ్బతింది. ధాన్యంలో మట్టి ఎక్కువగా ఉండటంతో దెబ్బతిన్న ధాన్యం పదిశాతం కంటే అధికంగా రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అనుమతి లేదని తిరస్కరిస్తున్నారు.
జిల్లాలో రంగు మారిన ధాన్యం ఎక్కువగా ఉన్నందున మిల్లర్లు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మిల్లర్లు జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా పంటను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించాం. దీనివల్ల కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నాం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో ఇబ్బందులు వస్తే కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించి మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ధాన్యం ఆరబెట్టి తీసుకువస్తే గిట్టుబాటు ధర పొందవచ్చు.
-దినేష్‌కుమార్, సంయుక్త పాలనాధికారి, గుంటూరు
ఇదీ చదవండి: