Evening Clinics: రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు స్పెషాల్టీ క్లినిక్‌లను నిర్వహించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం మధ్యాహ్నం రెండు గంటల వరకే ఓపీ సేవలు లభిస్తున్నాయి. ఆ తర్వాత వైద్యులు బోధనకు వెళుతున్నారు. సాయంత్రం క్లినిక్‌ల అవసరం గురించి ఇటీవల జరిగిన సమావేశాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పదేపదే ప్రస్తావించారు. వీటిని కచ్చితంగా ఏర్పాటుచేయాలని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
‘దూరప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రికి రావడం కొన్నిసార్లు ఆలస్యం అవుతోంది. వైద్యులు వెళ్లిపోతుండటంతో మరుసటిరోజు దాకా వారు ఎదురుచూడాల్సి వస్తోందని’ అధికారుల దృష్టికి తెచ్చారు. సాయంత్రం క్లినిక్‌ల ఏర్పాటుతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం నిమ్స్‌లో మాత్రమే సాయంత్రం క్లినిక్ సేవలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. సాయంత్రం క్లినిక్‌లలో పనిచేసే వారికి వేళల్ని సర్దుబాటు చేస్తామని వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వ బోధనాసుపత్రుల వైద్యుల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘సాయంత్రం క్లినిక్‌ల అవసరం ఏంటి? ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా పనివేళలు ఎలా పెంచుతారు’ అని ప్రశ్నించింది. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపిన ఎంకే స్టాలిన్.. అందుకోసమేనటా..!