English Medium in TS Government schools: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. అదేవిధంగా ప్రైవేటు బడులు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి విధి విధానాలను రూపొందించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ఉపసంఘంలో సభ్యులు వీరే..
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన.. ఈ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో.. శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో 'మన ఊరు – మన బడి’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: విద్యాసంస్థలు తెరిచాం.. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు: సురేశ్