సంచలనం సృష్టించిన చైనా బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ యాప్‌ల ద్వారా సమీకరించిన కోట్ల సొమ్ము ఎక్కడుందో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) అధికారులు కనిపెట్టారు. రూపాయల్లో ఉన్న సొమ్మును డిజిటల్(క్రిప్టో) కరెన్సీగా మార్చి ఉత్తర అమెరికాలోని కేమన్ దీవులకు పంపించినట్లు ఆధారాలు సేకరించారు. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ‘వజీర్ ఎక్స్’ ద్వారా జరిగిన ఈ ఆర్థిక లావాదేవీల్లో విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. సుమారు రూ.2790.74 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలపాలంటూ ఎక్స్ఛేంజ్ డైరెక్టర్లు నిశ్చల్‌శెట్టి, సమీర్ హనుమాన్ మాత్రేకు శుక్రవారం షోకాజ్ నోటీసులు పంపించారు.
చైనా దేశస్థుల అధీనంలోని బెట్టింగ్ యాప్‌ల ద్వారా సేకరించిన సొమ్ము విదేశాలకు తరలిందనే కోణంలో మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో చైనా దేశస్థులు రూ.57 కోట్ల భారత కరెన్సీని క్రిప్టో కరెన్సీలోకి మార్చినట్లు గతంలోనే గుర్తించారు. ఆ సొమ్మును కేమన్ దీవుల్లో రిజిస్టర్ అయిన బైనాన్స్ వాలెట్లలోకి తరలించినట్లు ఆధారాలు సేకరించారు.
అవసరమైన ధ్రువపత్రాల్లేవ్
విదేశాల నుంచి వచ్చిన సూచనలతోనే వజీర్ ఎక్స్ ఈ లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సొమ్మును ఇక్కడి వ్యక్తిగత ఖాతాల నుంచి విదేశాల్లోని వ్యక్తిగత ఖాతాల్లోకి, ఇతర వాలెట్లలోకి బదిలీ చేసినట్లు గుర్తించారు. అయితే భారత కరెన్సీని క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు పంపే క్రమంలో ఫెమా నిబంధనల మేరకు అవసరమైన ధ్రువపత్రాల్ని ఎక్స్ఛేంజ్ నిర్వాహకులు సేకరించలేదని వెల్లడైంది. ఈడీ దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఎక్స్ఛేంజ్‌లో నమోదైన ఖాతాల్లోకి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల నుంచి రూ.880 కోట్లు వచ్చాయని, అలాగే రూ.1,400 కోట్లు భారత్ నుంచి విదేశాల్లోని బైనాన్స్ ఖాతాల్లోకి వెళ్లాయని గుర్తించారు. ఆడిట్ లేదా దర్యాప్తు చేసేందుకు ఈ ఆర్థిక లావాదేవీలేవీ బ్లాక్ చెయిన్‌లో అందుబాటులో లేవని తేలింది.
దీన్ని బట్టి వజీర్ ఎక్స్ ఎక్స్ఛేంజ్ నిర్వాహకులు ఫెమా నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించి భారత్ నుంచి విదేశాలకు ఆర్థిక లావాదేవీలు సాగించారని భావిస్తున్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీలకు ఈ ఎక్స్ఛేంజ్ సురక్షిత కేంద్రంగా ఉన్నట్లు అనుమానిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ షోకాజ్ నోటీసులకు వచ్చే సమాధానాల ఆధారంగా చైనా బెట్టింగ్ యాప్‌ల కేసు దర్యాప్తు కీలక పురోగతి సాధించే అవకాశముంది.
ఇదీ చదవండి: 'కశ్మీర్' సమస్యకు త్వరలోనే రాజకీయ పరిష్కారం!