దేవాదాయశాఖలో విశాఖ జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) కె.శాంతిపై అభియోగాలు నమోదు చేస్తూ ఆ శాఖ కమిషనర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీచేశారు. 30 రోజుల్లో లిఖితపూర్వకంగా జవాబివ్వాలని అందులో తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఏసీ శాంతి ఇసుక తెచ్చి ఇన్‌ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) పుష్పవర్ధన్‌పై ఆయన ఛాంబర్‌లోనే చల్లడం చర్చనీయాంశమైంది. దీనిపై ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (రాజమహేంద్రవరం) విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. అందులో ఏసీ శాంతి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఉన్నతాధికారుల పట్ల మర్యాదపూర్వకంగా ఉండట్లేదని నివేదిక ఇచ్చారు. అప్పట్లో ఆమెపై చర్యలేవీ తీసుకోలేదు. కొద్ది రోజులకు ఇన్‌ఛార్జి డీసీ పుష్పవర్ధన్‌ను కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఆయన చేరకుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల విశాఖలోని దేవాదాయశాఖ ఉద్యోగులు, ఈవోలు.. ఏసీ శాంతి తీరుపై నిరసనలు చేపట్టారు. దీంతో కొత్త కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆర్‌జేసీ నివేదిక ఆధారంగా ఏసీపై అభియోగాలు నమోదు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఉద్యోగులపై ఆధిపత్య ధోరణి చూపడం, విధులు సక్రమంగా నిర్వహించకపోవడం, దారపాలెం దారమళ్లేశ్వర ఆలయ ఈవో లేకుండానే వేరొక డివిజన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరాజుతో హుండీ లెక్కింపు చేయించడం, రిజిస్టర్‌లో నమోదు చేయకుండానే హుండీ డబ్బులను తీసుకెళ్లడం, తనకు అధికారం లేకపోయినా ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీధర్‌ను సస్పెండ్ చేయడం, ఉద్యోగులను తరచూ తిట్టడం, ఆలయాల ఖర్చుల కోసం ఈవోలు డబ్బులు డ్రా చేసేందుకు సకాలంలో అనుమతించకపోవడం, డీసీ పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లడం తదితర అభియోగాలకు బదులివ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Water issues: రాష్ట్రానికి నష్ట భయం తొలగేనా?