రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ అన్నారు. అందరి లక్ష్యం ఒకటే అయినందున కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా జీవోలపై పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల పేర్లు వేరైనప్పటికీ వారంతా ఉద్యోగులేనని స్పష్టం చేశారు. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప అధికారుల కమిటీ సిఫార్సులు కాదని చెప్పారు. చట్ట ప్రకారం ఉన్న వేతనాలను తగ్గించేందుకు అవకాశం లేనప్పుడు.. పీఆర్సీ జీవోలు ఇచ్చి వేతనాలు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. హెచ్‌ఆర్‌ఏ తగ్గించిన ప్రభుత్వం మండల స్థాయిలో రూ. 1,600కు ఒక గది ఎక్కడైనా అద్దెకు ఇప్పిస్తారా? అని నిలదీశారు. ఈ అంశంపై కొందరు మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులంతా ఒక నిర్ణయానికి రావాలని.. అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడతామని సూర్యనారాయణ వెల్లడించారు.
ఇదీ చదవండి: IAS Officers Respond: సీఎస్ సమీర్‌శర్మపై ఆరోపణలను ఖండించిన ఐఏఎస్‌ల సంఘం