చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా బాణసంచా కాల్చారు. మహిళలు లోగిళ్ల ముంగిట దీపాలను వెలిగించి కొత్త కాంతులు నింపారు. బూర్జలో తెలుగుదేశం నేత కూన రవికుమార్ కార్యకర్తలతో కలిసి దీపావళిని చేసుకున్నారు. టపాసులు కాల్చుతూ సందడి చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకున్నారు. మహిళలు లక్ష్మీదేవికి పూజలు చేసి మతాబులు కాల్చారు.
దీపావళి వెలుగుల్లో సాగర నగరం విశాఖ వెలుగులీనింది. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకున్నారు. అపార్ట్‌మెంట్లలో మతాబులు కాల్చుతూ పిల్లలు సందడి చేశారు. మహిళలు లక్ష్మీపూజలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లారు.శారదాపీఠంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ప్రత్యేక పూజలు చేశారు. వేద విద్యార్థులు బాణసంచా కాల్చారు. తూర్పుగోదావరి జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తునిలో పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
కృష్ణా,గుంటూరు జిల్లాల్లోనూ పెద్దఎత్తున ప్రజలు టపాసులు కాల్చి ఆనందంగా దీపావళి జరుపుకున్నారు. కృష్ణా జిల్లా ఐతవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు. ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలోని వృద్ధాశ్రమంలో వివిధ మతాలకు చెందిన వయోవృద్ధులచే నిర్వాహకులు టపాసులు కాల్పించారు. విజయవాడలో ఇంటింటా దీపపు కాంతులు వెల్లివిరిశాయి. ఇంద్రకీలాద్రిపై దీప ప్రజ్వలన ఘనంగా జరిగింది.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పండుగ ఉత్సాహంగా సాగింది. వీధులు బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయాయి. కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, తడలో ప్రజలు సంతోషంగా టపాసులు కాల్చారు. మహిళలు లక్ష్మీ దేవికి పూజలు నిర్వహించారు. కడప జిల్లా రాయచోటిలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భద్రకాళీ సమేత వీరభద్రస్వామి గజవాహనంపై పురవీధుల్లో ఊరేగారు.
కర్నూలులో మహిళలు సంప్రదాయబద్ధంగా దీపావళి జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి దంపతులు బాణాలు కాల్చి సందడి చేశారు. పత్తికొండ మండలం జేఎం తాండాలో గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు.
ఇదీ చదవండి: