ఐదు దేవాలయాలకు సంబంధించిన కేసులను ఈ రోజు పరిష్కరించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో మూడు, గుంటూరు గ్రామీణంలో ఒక కేసు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసును పరిష్కరించామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో విగ్రహాల ధ్వంసానికి సంబంధించి నరసరావుపేటలో కొన్ని అసత్య ప్రచారాలు జరిగాయన్నారు. నరసరావుపేటలోని కృష్ణవేణి కళాశాల ఆవరణలో ఉన్న సరస్వతి దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిందని చెప్పారు.
గతంలో విగ్రహం ఉన్న స్థలాన్ని ఓ కళాశాలకు అద్దెకు ఇచ్చామని.. యాజమాన్యం నిర్మించిన రేకుల షెడ్డులను తొలగించే క్రమంలో సరస్వతి దేవి విగ్రహానికి నష్టం వాటిల్లిందని స్థలం యజమాని తెలిపారన్నారు. ఎవరూ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలని డీజీపీ తెలిపారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో చెత్తకాగితాలు ఏరుకునే ఇద్దరు బాలికలు హుండీ దొంగతనానికి పాల్పడ్డారని, ఈ కేసును సీసీ కెమెరాల ఆధారంగా ఛేదించామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అంతర్వేది ఘటన మొదలుకుని దేవాలయాలకు సంబంధించి నమోదైన కేసుల్లో 33 కేసులలో 27 పరిష్కరించామన్నారు. మూడు అంతర్రాష్ట్ర ముఠాలను కూడా అరెస్టు చేశామని డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న మరో 76 కేసులలో 178 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు: మూలా నక్షత్రం రోజు సీఎం హాజరు