రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాటు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో టీకాల నిల్వకు తగ్గట్లు 40 భారీ రిఫ్రిజిరేటర్లు రాష్ట్రానికి చేరుకుంటున్నాయి. చెన్నై నుంచి కొవిడ్ టీకా రాష్ట్రానికి రానుంది. పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేసే విధానాన్ని టీకా పంపిణీకి అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. చేతికి చర్మం కింద లేదా కండరాలకు సూది ద్వారా టీకా వేసేందుకు వీలుగా సిరంజిలను సిద్ధం చేయాలని సంకేతాలిస్తోంది. 0.1 ఎంఎల్, 0.5 ఎంఎల్ సిరంజిలను సిద్ధం చేసేలా చర్చలు సాగాయి. రాష్ట్రంలో అవి లేకపోతే, కేంద్రం పంపనుంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి (డిసెంబరు 25) సందర్భంగా టీకా పంపిణీలో కీలక ఘట్టం చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టీకా పంపిణీ ఇలా..!
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు కలిపి సుమారు 3లక్షల మంది ఉన్నారు. 50-60 ఏళ్ల మధ్య కోటి మంది, 60 ఏళ్లు దాటినవారు 75 లక్షల మంది ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పాత్రికేయులు, రవాణా ఉద్యోగులకూ టీకా పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చిన్న వయసులో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికీ టీకాలు ఇస్తారు. ఈ వివరాలను ఇప్పటికే ‘కొవిన్’లో నమోదు చేస్తున్నారు. ఎన్నికలలో గుర్తింపుకార్డు చూపించిన వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నట్లే.. టీకా పంపిణీలోనూ వ్యవహరిస్తారు. ప్రతి పంపిణీ కేంద్రం వద్ద పోలీసు కానిస్టేబుల్ లేదా హోంగార్డును, టీకా వేసేందుకు ఇద్దరు, వివరాల నమోదుకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమిస్తారు. టీకా పంపిణీకి తగినంత స్థలం ఉన్న ప్రదేశాలనే కేంద్రాలుగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచిస్తోంది.
రియాక్షన్ వస్తే తక్షణ చికిత్స
టీకా వేసినప్పుడు.. కొందరికి దురద లాంటి సమస్యలు రావచ్చు. అలా వస్తే ఎలా స్పందించాలి, ఏయే మందులను అందుబాటులో ఉంచుకోవాలన్న దానిపైనా కేంద్రం అవగాహన కల్పిస్తోంది. టీకా వేయించుకున్న వారిని కనీసం అరగంట అక్కడే ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రస్థాయి అధికారులకు జూమ్‌లో శిక్షణ మొదలైంది. తర్వాత డీఎంహెచ్‌ఓలు, ఇతర ఉన్నతాధికారులకు శిక్షణ ఇస్తారు. టీకా పంపిణీపై ఆరోగ్య కార్యకర్తలకు నేరుగా శిక్షణ ఇస్తారు.
క్రియాశీల కేసులు తగ్గుముఖం
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కరోనా క్రియాశీల కేసుల సంఖ్య వెయ్యి కంటే తక్కువకు చేరింది. ప్రస్తుతం 5,237 క్రియాశీల కేసులుండగా.. అత్యధికంగా కృష్ణాలో 994, అత్యల్పంగా కర్నూలులో 89 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 64,354 నమూనాలు పరీక్షించగా.. 538 మంది (0.8%)కి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 8,73,995కు, మరణాలు 7,047కు చేరాయి. ఇప్పటివరకూ 1,06,35,197 నమూనాలు పరీక్షించగా 8.22 శాతం పాజిటివిటీ రేటు ఉంది. రికవరీ రేటు 98.55 శాతం కాగా మరణాల రేటు 0.80 శాతంగా ఉంది.
ఇదీ చదవండి : 5 శాతం ఓట్లు మళ్లితే వైకాపా ఇంటికే : చంద్రబాబు