CM REVIEW: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో బైజూస్ కంటెంట్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పాఠ్యాంశాల వీడియోలను పిల్లలకు అందుబాటులో ఉంచేందుకు ప్రతి తరగతి గదిలో టీవీ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ‘నాడు-నేడు’ కింద దీన్ని పూర్తిచేయడంపై అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ గురువారం సమీక్షించారు. దీనికిముందు ఎడ్యుటెక్ సంస్థ బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, బైజూస్ వైస్‌ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) సుస్మిత్ సర్కార్ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్ భాగస్వామి కావడం చాలా సంతోషకరం. పిల్లలకు సులభంగా అర్థమయ్యే వీడియోలు 4-10 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఏడాదికి రూ.20-24వేల వరకు చెల్లిస్తేగానీ లభించని బైజూస్ కంటెంట్ ప్రభుత్వ పాఠశాలల్లోని పేదపిల్లలకు అందుబాటులోకి వస్తుంది. ఉపాధ్యాయులకు శిక్షణ లభిస్తుంది. విద్యారంగాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి బైజూస్ సీఈఓ రవీంద్రన్ లాంటివారు ముందుకు రావడం శుభపరిణామం. విద్యారంగంలో ఇదొక మేలిమలుపు’ అన్నారు.
ఏటా రూ.500కోట్ల వ్యయం
‘8, 9, 10 తరగతులు చాలా ముఖ్యం. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నవారు 2025 మార్చిలో సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలు రాస్తారు. వీరికి నాణ్యమైన విద్య అందించాలి. అందుకే ఎనిమిదో తరగతికి వచ్చే ప్రతి విద్యార్థికీ ట్యాబ్ ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 4.70 లక్షల మంది పిల్లలకు ఈ సెప్టెంబరులో ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఏటా పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడానికి రూ.500 కోట్లు ఖర్చవుతుంది’ అని తెలిపారు.
నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం అడుగులు: బైజూస్ సీఈఓ
పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారని, ఇది చాలా ఉత్సాహాన్నిస్తోందని బైజూస్ సీఈఓ రవీంద్రన్ అన్నారు. ఒప్పంద కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘సీఎంతో మే 25న దావోస్‌లో సమావేశమయ్యాం. ఒక యంగ్ స్టార్టప్ కన్నా వేగంగా ఆయన అడుగులు వేశారు. ప్రైవేటు పాఠశాలలకు అందుబాటులో ఉండే కంటెంట్‌ను ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు అందిస్తే.. సానుకూల ఫలితాలు వస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడ్యుటెక్ కంపెనీగా మాకు సామాజిక బాధ్యత ఉంది. లాభాల కోసం కాకుండా మంచి చేయడానికి మాకు ఇదో చక్కటి అవకాశం. వచ్చే 20-30 ఏళ్ల పాటు పిల్లల జీవితాలు అత్యంత ప్రభావితమవుతాయి’ అన్నారు.
ఒప్పందంతో ప్రయోజనాలివీ..
* ప్రభుత్వ పాఠశాలల్లో 4-10 తరగతి వరకు 32లక్షల మంది పిల్లలు ఉన్నారు. బైజూస్ ఒప్పందంతో వీరందరికీ నాణ్యమైన విద్య అందుతుంది.
* గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.
* ఎంతవరకు నేర్చుకున్నారనే విషయమై ప్రతి విద్యార్థికీ ఫీడ్‌బ్యాక్ పంపుతారు.
* సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా పాఠాలను రూపొందించారు. విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు పాఠ్యాంశంతో పాటు వెంటనే ప్రశ్నలు వస్తాయి.
* తరచు సాధన చేసుకునేందుకు వీలుగా మాదిరి ప్రశ్నపత్రాలు ఉంటాయి. విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెలవారీగా నివేదిక ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులతో సమావేశం ఉంటుంది.
తక్కువ ఉత్తీర్ణత తప్పు కాదు
‘పదోతరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణత రావడాన్ని తప్పుగా భావించనక్కర్లేదు. ఫెయిలైనవారికి నెల రోజుల్లోనే పరీక్షలు పెడుతున్నాం. వాటిలో ఉత్తీర్ణులైతే రెగ్యులర్‌గానే పరిగణిస్తాం. రెండోదశలో ‘నాడు-నేడు’ కింద చేపట్టనున్న 22,344 పాఠశాలల్లో ఈ నెలాఖరుకు పనులు మొదలుపెట్టాలి. బాలికల కోసం 292 మండలాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటుచేయాలి’ అని ఆదేశించారు.
ఇవీ చదవండి: