అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, వాటి అమలుపై సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఎకానమీని ఎలా పునరుద్ధరించాలి..? తిరిగి ఎలా పునరుత్తేజం చేయాలి ? అనే ఆలోచనతో ఈ క్యాలెండర్ తయారు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, జేసీలు దీన్ని జాగ్రత్తగా అమలు చేయాలని ఆదేశించారు.
బకాయిలు చెల్లిస్తాం…
ఈనెల 22న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల మొత్తం రూ.905 కోట్లలో సగం చెల్లించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మిగిలిన సగం మొత్తాన్ని జూన్‌లో చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు దాదాపు 10 లక్షల ఉద్యోగాలను ఇస్తున్నాయని... ఆ యూనిట్ల వారంతా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వీటిని మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కరెంటు ఫిక్స్‌డ్ ఛార్జీలు కూడా రద్దు చేస్తూ ఇప్పటికే జీవో ఇచ్చామని… 3 నెలల పాటు ఆ ఛార్జీలు రద్దు అవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అన్ని వర్గాలకు ఆర్థిక సాయం…
ఈ నెల 26న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్స్, మౌజంలకు రూ.5 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న రైతు భరోసాకేంద్రాలు ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామాల ఆర్థిక వ్యవస్థను మార్చడంతో పాటు గ్రామాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 4 న వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద సొంత ఆటో, సొంత క్యాబ్ ఉన్న వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. జూన్ 10న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్ షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10వేలు ఇస్తామన్నారు. మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద జూన్ 17న ఆర్ధిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
ఆప్కోను ఆదుకుంటాం…
ఆప్కోకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు సహా… మాస్క్‌ల తయారీకి ఆప్కో నుంచి తీసుకున్న బట్టకు సంబంధించిన నగదు చెల్లిస్తామన్నారు. జూన్ 24న వైఎస్సార్ కాపునేస్తం అమలు చేస్తామని... 45-60 ఏళ్ల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు రూ.15వేలు ఇస్తామన్నారు. జూన్ 29న ఎంఎస్‌ఎంఈలకు రెండో విడతగా రూ.450 కోట్లు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. జులై 1న 104, 108 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభిస్తామన్నారు. ఆ రోజున 1060 కొత్త వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్ స్పష్టం చేశారు.
జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా… ఆ రోజున పేదలకు 27 లక్షల ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. జులై 29న రైతులకు వడ్డీలేని రుణాలకు సంబంధించి మొత్తం విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 3న వైఎస్సార్ విద్యాకానుక పథకం కింద పిల్లలకు యూనిఫారం, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు ఇస్తామన్నారు.
పట్టాల పంపిణీ…
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత కింద 45-60 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు రూ.18,750 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ వసతి దీవెన కార్యక్రమం కింద ఆగస్టు 19న ఉన్నత చదువులు చదువుతున్న వారికి భోజనం,లాడ్జింగ్ కోసం పిల్లల తల్లులకు రూ.10వేల చొప్పున మొదటి దఫా వసతిదీవెన అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆగస్టు 26న వైఎస్సార్ గృహనిర్మాణం పథకం ప్రారంభించి… 15 లక్షల ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం ప్రారంభిస్తామన్నారు.
సెప్టెంబరు 11న వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి స్వయం సహాయక బృందాల మహిళలకు రుణాల మాఫీ చేస్తామన్నారు. ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు దఫాల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చినందునా... మొదటి దఫా మొత్తాన్ని ఆ రోజు అందిస్తామన్నారు. సెప్టెంబరు 25న వైఎస్సార్ విద్యాదీవెన ప్రారంభించి… మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులను నేరుగా పిల్లల తల్లుల చేతికే ఇస్తామన్నారు. అక్టోబరులో రైతుభరోసాకు సంబంధించి రెండో విడతగా ప్రతి కుటుంబానికి రూ.4వేల చొప్పున ఇస్తామని సీఎం జగన్ తెలిపారు.
అక్టోబరు నెలలోనే హాకర్స్‌కు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తామని... చిరు వ్యాపారులకు జగనన్నతోడు’ అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇచ్చి సున్నా వడ్డీకే రూ.10వేల చొప్పున రుణం ఇస్తామన్నారు. నవంబర్ నెలలో విద్యా దీవెనకు సంబంధించి రెండో దఫా పిల్లల ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలో జమచేస్తామన్నారు. డిసెంబర్ మాసంలో అగ్రిగోల్డ్ బాధితులకు సహాయం చేస్తామని... కలెక్టర్లు, ఎస్పీలు, సీఐడీ విభాగాలు… కోర్టుల నుంచి అనుమతులు తీసుకుని జాబితాలు ఆమోదింపజేసుకోవాలని సీఎం ఆదేశించారు.
వచ్చే ఏడాది జనవరిలో వరుసగా రెండో ఏడాది అమ్మఒడి కార్యక్రమం కింద ఆర్థిక సాయం చేస్తామన్నారు. అదే నెలలో రైతు భరోసా చివరి విడత కింద 2వేలు జమచేస్తామని సీఎం జగన్ చెప్పారు. ఫిబ్రవరి 2021లో విద్యాదీవెన మూడో త్రైమాసికం చెల్లింపులు సహా… వసతిదీవెన రెండో దఫా ఇస్తామన్నారు. 2021 మార్చిలో పొదుపుసంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని సీఎం తెలిపారు. లబ్ధిదారులను గుర్తించడం సహా అప్‌డేషన్ చేసేందుకు ముందుగా క్యాలెండర్ ను చెబుతున్నట్లు సీఎం తెలిపారు.
పథకాల లబ్ధిదారుల్లో ఎవరి పేరైనా లేకపోతే… ఎవరికి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తప్పక తెలియజేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. తనకు ఓటు వేయకపోయినా పర్వాలేదని… అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు కచ్చితంగా అందాలని సీఎం ఆదేశించారు. సోషల్ ఆడిట్ తప్పనిసరిగా జరగాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలను నిర్ణీత కాలవ్యవధిని తప్పక పాటించాలని సూచించారు. పెన్షన్లు, బియ్యం కార్డుల మంజూరు నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు చూస్తున్న జేసీ ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వరించాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి