కర్బన ఉద్గార రహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందన్నారు. ‘కర్బన ఉద్గార రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన’ అనే అంశంపై దావోస్‌లో మంగళవారం జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇంధన, పారిశ్రామిక రంగాల పరివర్తన, భవిష్యత్తులో ఈ దిశగా అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలు, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆర్సెలర్ మిత్తల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిత్తల్, గ్రీన్‌కో గ్రూప్ సీఈవో అనిల్ పాల్గొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలవనుంది. ఇక్కడికి రావడానికి కొద్ది రోజుల కిందట కర్నూలులో 5,230 మెగావాట్ల సమీకృత పునరుత్పాదక విద్యుత్ నిల్వ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 33వేల మెగావాట్ల పీఎస్‌పీలు
‘మనం 15-16వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్‌పీ) గురించి మాట్లాడుతున్నాం. 33వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల పీఎస్‌పీలను ఏర్పాటు చేసే సామర్థ్యం ఏపీలో ఉంది. ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. సంప్రదాయేతర పరిశ్రమలకూ మార్పు చెందవచ్చు. ఈ విద్యుత్‌ను వినియోగించుకుని హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి చేయవచ్చు. ఎలక్ట్రాలసిస్ విధానంలో నీటి లవణీకరణ ప్రక్రియనూ నిర్వహించొచ్చు. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మైలురాయిగా నిలుస్తాయి. 5,230మెగావాట్ల సౌర, పవన, పీఎస్‌పీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం. ఇందులో 1,650 మెగావాట్లు పీఎస్‌పీ ప్రాజెక్టు. ఇది బ్యాటరీ విద్యుత్ మాదిరే ఎలాంటి హానికరం కాదు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. పెట్టుబడులతో రండి’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
కర్బన రహిత కేంద్రంగా ఏపీ
ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. ఒకే చోట సౌర, పవన, జల విద్యుత్ ప్లాంట్ల ద్వారా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే తరహాలో పీఎస్‌పీల ద్వారా 33వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే.. భారత్‌లో ముఖ్యమైన కర్బన ఉద్గార రహిత కేంద్రంగా ఏపీ నిలుస్తుంది. యావత్ ప్రపంచానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది. - అమితాబ్ కాంత్, సీఈవో నీతి ఆయోగ్
ఏపీలో పెట్టుబడులకు అనుకూల విధానాలు
గ్లోబల్ రెన్యూవబుల్ ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో సంస్థ భాగస్వామ్యంతో రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టాం. భవిష్యత్తులో పెట్టుబడిని రెట్టింపు చేస్తాం. పునరుత్పాదక ప్రాజెక్టు కోసం ఏపీనే ఎంచుకున్నాం. అక్కడి ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఎంతో సానుకూలంగా ఉన్నాయి. కర్నూలులో ఒకే చోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి కానుంది. తక్కువ నీటి వినియోగంతో సాధించడం ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ రోజంతా 250మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టును నేను ప్రత్యక్షంగా సందర్శించాను.- ఆదిత్య మిత్తల్, ఆర్సెలర్ మిత్తల్ గ్రూప్ సీఈవో
పలువురు ప్రముఖులతో సీఎం చర్చలు
టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ, జుబిలియంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కాళీదాస్ హరి భర్తియా, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు లుక్ రెమంట్, సెకోయ క్యాపిటల్ ఎండీ రంజన్ ఆనందన్, బహ్రెయిన్ ఆర్థికశాఖ మంత్రి సల్మాన్ అలీ ఖలీఫాతో సీఎం జగన్ చర్చించారు.
హరిత విద్యుత్ రంగంలో రూ.65వేల కోట్ల పెట్టుబడులు
హరిత విద్యుత్ ఉత్పత్తి రంగంలో రూ.65వేల కోట్లు పెట్టేలా మంగళవారం మూడు సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) కుదుర్చుకుంది. వీటి ద్వారా 14వేల మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తితో పాటు 18వేల మందికి ఉపాధి లభిస్తుంది.
* రాష్ట్రంలో 8వేల మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్‌కో-ఏపీ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదిరింది. దీని ప్రకారం వెయ్యి మెగావాట్ల పీఎస్‌పీ, 5వేల మెగావాట్ల సౌర, 2వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను సంస్థ ఏర్పాటు చేయనుంది. రూ.37వేల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుంది.
* అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 6వేల మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ రూ.28వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 8వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. ఎంవోయూలో భాగంగా 2వేల మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టులు, 4వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
* మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు ఏస్ ఆర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. హరిత విద్యుత్ ద్వారా పారిశ్రామిక ఉత్పత్తి చేసేలా జోన్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రపంచ స్థాయి కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సంస్థ కల్పిస్తుంది.
దావోస్‌లో సీఎం జగన్‌తో సమావేశం అనంతరం ప్రకటన : విశాఖలోని ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీలు ప్లాంటు విస్తరణకు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. దావోస్‌లో సీఎం జగన్‌తో సంస్థ సీఈవో ఆదిత్య మిత్తల్ మంగళవారం సమావేశమయ్యారు. విశాఖలోని ప్లాంటు విస్తరణ ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం సీఈవో ఆదిత్య మిత్తల్ మాట్లాడుతూ.. ‘ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 8 మిలియన్ టన్నుల (ఎంపీటీఏ) నుంచి 11 ఎంపీటీఏలకు పెరుగుతుంది. పర్యావరణ అనుమతులు పొంది... 2023 నాటికి విస్తరణ పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం. గ్రీన్‌కో సంస్థ భాగస్వామ్యంతో కర్నూలులో ఏర్పాటు చేసిన సమీకృత పునరుత్పాదక విద్యుత్ నిల్వ ప్రాజెక్టులో మిత్తల్ సంస్థ పెట్టుబడి పెట్టింది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘మిత్తల్ ప్లాంటు విస్తరణ దేశ ఉక్కు తయారీ అభివృద్ధికి దోహద పడుతుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: Davos Summit: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపనకు ఏపీ అనుకూలం: సీఎం జగన్