కొవిడ్ నివారణ చర్యలు, టీకా పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అందరికీ కరోనా పరీక్షలు అందుబాటులో ఉండాలని సూచించారు. లక్షణాలు ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్నారు.
పట్టణ ప్రాంతాల్లో 62శాతం కరోనా కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్ కేసులున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే మరణాలు అధికంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. బాధితులు ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడమే కారణమని వివరించారు.
కొవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 104 కాల్ సెంటర్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలన్నారు. 1902 హెల్ప్‌లైన్‌కు వచ్చే విజ్ఞప్తులు పరిశీలించాలన్నారు. ఏ సమస్యపై ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆస్పత్రులను పర్యవేక్షించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై కూడా దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య శ్రీ, ప్యానల్ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని సీఎం సూచించారు. అన్ని జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలతోపాటు టీకా అమలును పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలోని కొన్ని శాఖల అధికారుల హోదాల్లో మార్పులు