ఆనందయ్య కరోనా మందుపై శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయి. మందుపై ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక పరీక్షల వివరాలను సీఎం జగన్‌కు ఆయుష్ అధికారులు అందించారు. కృష్ణపట్నంలో ఆనందయ్య 30-35 సంవత్సరాలుగా మందును ఇస్తున్నారని నివేదికలో పేర్కొన్న వారు... నోటి ద్వారా నాలుగు, కళ్లలో చుక్కలతో కలిపి ఐదు రకాలుగా మందులు ఇస్తున్నారని తెలిపారు. మందు తయారీలో ఆనందయ్య 18 రకాల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారని, అవన్నీ కూడా సహజంగా దొరికేవేనని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు.
మందుల శాంపిళ్లను హైదరాబాద్‌లోని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపామని, ప్రస్తుతానికి వచ్చిన నివేదికల్లో మందుతో ఎలాంటి హానీ లేదని తెలిపారు. ఇంకా 3 రకాల పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మందు తీసుకున్న సుమారు 500 మంది అభిప్రాయాలను సీసీఆర్ఏఎస్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సేకరించినట్లు చెప్పారు. వాటన్నింటిని విశ్లేషించి పూర్తిస్థాయిలో ఫలితాలను వెల్లడిస్తుందని రాములు వివరించారు. కంటిలో వేసే డ్రాప్స్‌పై కంటి వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని సీఎం ఆదేశించారని వీటన్నింటిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుందామని సీఎం జగన్ చెప్పారని తెలిపారు.
ఆనందయ్య ఇస్తోన్న మందు ఆయుర్వేద మందు అనడానికి చట్టం అనుమతించదన్న ఆయుష్ కమిషనర్..... పూర్తిస్థాయి పరీక్షల తర్వాతా హానికరం కాదని తేలితే మరోరూపంలో పంపిణీకి అవకాశం ఉండొచ్చని తెలిపారు. ప్రజారోగ్యం విషయంలో తొందరపాటు చర్యలు పనికిరావన్న ఆయుష్ కమిషనర్..... మందులోని మిశ్రమాల కలయిక వల్ల కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలాల్సి ఉందన్నారు. అప్పుడే పంపిణీపై పూర్తిస్పష్టత వస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి