ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని పదే పదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి ఆధిక్యత ఉందని... దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారుతాయనే సంపూర్ణ విశ్వాసం తనకుందని చెప్పారు. దేవుడి ఆశీస్సులతో ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని కోరుకుంటున్నానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదని... ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూడగా, దాన్ని కూడా... లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్ల కేసు కోసం తాకట్టు పెట్టేశారని వ్యాఖ్యానించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కేంద్రంలో రెండు మంత్రి పదవులు అనుభవించారని.. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడటంతో ఇప్పుడు దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాము విన్నవించుకోవాల్సి వస్తోందని అన్నారు. ‘అప్పట్లో ఫలానా వ్యక్తి వస్తే జాబు వస్తుందని గొప్పగా చెప్పారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని, లేకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఉద్యోగాలూ లేవు... నిరుద్యోగ భృతీ లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం ఒక నాటకం ఆడారు’ అని జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
ఏ నెలలో ఏ నోటిఫికేషనో చెబుతున్నాం
ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందోనని చదువుకున్న పిల్లలు ఎదురుచూస్తారు. శిక్షణకు ఎంత సమయం కేటాయించాలా అని ఆలోచిస్తారు. జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని శిక్షణ పొందుతుంటారు. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక, అవి ఎప్పుడిస్తారో తెలియక ఒక్కోసారి మనోధైర్యం కోల్పోయేవారు. ఈ పరిస్థితి మారుస్తూ రాబోయే 9 నెలల్లో జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఈ వ్యవధిలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం.
* బ్యాక్‌లాగ్ పోస్టులతో పాటు గత ప్రభుత్వం భర్తీచేయకుండా వదిలేసిన పోస్టుల్ని ఇప్పుడు భర్తీ చేస్తున్నాం. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సామాజిక న్యాయాన్ని అమలుచేస్తున్నాం. అవినీతి, పక్షపాతం, వివక్ష, లంచాలకు తావులేకుండా ఈ ఉద్యోగాలు భర్తీచేస్తాం. దళారులు, పైరవీలు, సిఫార్సులకు తావులేకుండా కేవలం రాత పరీక్షలో ప్రతిభ ప్రాతిపదికనే పారదర్శకంగా ఈ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఇంటర్వ్యూల విధానానికి స్వస్తి చెబుతూ అర్హులకే ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాం.
* అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేని రీతిలో 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించి, ఆ వ్యవస్థలో 2.50 లక్షల మందికి పైగా నిరుద్యోగుల్ని భాగస్వాముల్ని చేశాం.
* గత రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలు భర్తీచేశాం. వీటిల్లో 1,84,264 శాశ్వత ఉద్యోగాలు. 3,99,791 పొరుగు సేవలవి, 19,701 ఒప్పంద ప్రాతిపదికన నియమించినవి. వీరే కాకుండా చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూర్చేలా వారి వేతనాలు పెంచాం. సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ గత ప్రభుత్వ హయాంలో ఆ ఉద్యోగులు ఎలా బతికారు? వారికి ఎంత వేతనాలు అందేవన్నది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ రెండేళ్లలో వారి వేతనాలు ఎంత పెరిగాయి? వారి బతుకులు ఎలా మారాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
దళారులు లేకుండా నేరుగా వేతనాలు
గత ప్రభుత్వ హయాంలో పొరుగు సేవల ఉద్యోగులు ఒక్కొక్కరికీ ప్రభుత్వం నుంచి రూ.12 వేలు వేతనం చెల్లిస్తే.. వారికి రూ.7-8 వేలే చేతికి అందేది. మధ్యలో దళారులు ఉండేవారు. వేతనాల కోసం లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అన్నివిధాలా వారు నష్టపోయేవారు. ఆ పద్ధతిని మార్చేసి.. ప్రతి నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా దళారులు లేకుండా వేతనాలు ఇస్తున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఉద్యోగాల నియామకాల కోసం ఆప్కాస్ ఏర్పాటు చేసి దాదాపు 95 వేల ఉద్యోగాలు ఇచ్చాం. గతం కంటే మెరుగైన వేతనాలు ఇస్తున్నాం.
* ఏడాదికి రూ.3,600 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతున్నా.. ఇచ్చిన మాట ప్రకారం 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఉద్యోగభద్రత ఇచ్చాం. వారి పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచాం. గతంలో ఎన్నడూలేని విధంగా ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ తీసుకొచ్చి వేతనాలు పెంచాం.
* ఏపీపీఎస్సీలో ఉద్యోగ నియామకాలు ఎప్పుడు ఉంటాయి? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని గతంలో నిరుద్యోగులు ఎదురు చూసేవారు. అప్పుడప్పుడు మీడియాలో లీకులు వచ్చేవి. నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షించేవారు. ఏళ్ల తరబడి పట్టణాలు, నగరాల్లో అద్దెలు చెల్లిస్తూ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకునేవారు. అయినా నోటిఫికేషన్లు వచ్చేవి కాదు.
* కొవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎక్కడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. నవరత్నాలు, వాగ్దానాల అమలు, పాఠశాలల నిర్మాణం ఆగలేదు.
* గతంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం రాజధానికి పరుగెత్తుకుని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మన ఉద్యోగాలు మన గ్రామాలకే వస్తున్నాయి. వికేంద్రీకరణతో జాబ్ మార్కెట్ కూడా విస్తరిస్తోంది.
ఇదీ చదవండీ... కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: ముఖ్యమంత్రి