YSRCP Rajya Sabha MP Candidates: అధికార పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తించిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరేసి నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డికి మరో అవకాశం కల్పించగా.. నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావుకు మరో సీటు కేటాయించారు. తెలంగాణకు చెందిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించారు.
అధికార వైకాపా నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. అందులోఒకరు అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కాగా.. మరొకరు ఆ కేసును వాదిస్తున్న న్యాయవాది నిరంజన్‌రెడ్డి. మొత్తం నాలుగు సీట్లలో ఏపీ, తెలంగాణకు చెరో సగం పంచారు. వచ్చే నెలతో పదవీకాలం ముగియనున్న విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించగా.. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావును జగన్ ఎంపిక చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిరంజన్‌రెడ్డితోపాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైకాపా తరఫున పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. వైకాపా అవిర్భావం తర్వాత ఆ పార్టీకి తొలిసారి 2017లో రాజ్యసభకు అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం రాగా.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డికి ఇచ్చారు.
అప్పటి నుంచి ఆయన ఎంపీగా, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. వచ్చే నెలతో ఆయన పదవీకాలం ముగియనుండగా... మరోసారి అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన కేసులను వాదిస్తున్న తెలంగాణకు చెందిన న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ టికెట్ కేటాయించారు. దీంతో కేసుల్లోని సహచరుడికి రెండో అవకాశం, కేసులను వాదిస్తున్న న్యాయవాదికి కొత్తగా సీఎం అవకాశం కల్పించారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరో రెండు సీట్లకు తెలుగుదేశం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బీసీ నేతలను జగన్ ఎంపిక చేశారు. వీరిలో ఒకరు కావలి నుంచి తెలుగుదేశం తరఫున గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన బీద మస్తాన్‌రావు కాగా... మరొకరు 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య ఉన్నారు.
మొత్తంగా నెల్లూరు జిల్లా నుంచే ముగ్గురు వైకాపా ఎంపీలు రాజ్యసభకు ప్రాతినిద్యం వహించనున్నారు. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఉండగా.. అదే జిల్లాకు చెందిన మస్తాన్‌రావుకు అవకాశం కల్పించారు. రాజ్యసభ స్థానాలకు అధికార పార్టీలో తీవ్ర పోటీ నెలకొనగా ఒక స్థానం బీసీలకు, మరొకటి ఎస్సీలు లేదా మైనార్టీలకు ఇవ్వాలని ముందుగా భావించారు. చివరికి రెండో సీటు కూడా బీసీలకే ఇచ్చారు. బీసీ కోటాలో బీద మస్తాన్‌రావు పేరు జనవరిలోనే ఖరారు కాగా మరో స్థానాన్ని కూడా బీసీలకే ఇస్తే 50శాతం స్థానాలను ఇచ్చామన్న సందేశం ఆ వర్గంలోకి వెళ్తుందని భావించారు. ఎవరో ఒక బీసీ నేతకు సీటు ఇస్తే పెద్దగా ప్రజల్లోకి వెళ్లకపోవచ్చని. ఆ వర్గంలోకి సందేశం గట్టిగా వెళ్లాలంటే బీసీలకు బ్రాండింగ్ ఉన్న ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడమే మేలని వైకాపా అధిష్టానం అనుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆర్.కృష్ణయ్య తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతగా గుర్తింపు ఉండటం కలిసొచ్చే అంశంగా వైకాపా భావిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్.కృష్ణయ్యకు సమాచారం వెళ్లగా.. వెంటనే ఆయన జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అభ్యర్థిత్వం ప్రకటించారు. బీసీల కోసం నిలబడ్డ వ్యక్తి కృష్ణయ్యను రాజ్యసభకు పంపించి బీసీల గళం వినిపిస్తే.. ఆ సందేశం బలంగా వెళుతుందనే ఆయన్ను ఎంపిక చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు... విజయసాయిరెడ్డికి సన్నిహితుడు. 2019 వరకు తెలుగుదేశంలో ఉన్న ఆయన్ను విజయసాయిరెడ్డే పట్టుబట్టి వైకాపాలోకి తీసుకొచ్చారు. పార్టీలో చేరిన వెంటనే ఆయన రాజ్యసభ సీటు ఆశించినా.... అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నాయకులను సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిసింది.
బలహీన వర్గాలకు ప్రాధాన్యత: వైకాపా రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయం పాటించారని చెప్పారు. బలహీన వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
బీసీలు బ్యాక్‌బోన్: బీసీలంటే బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్‌బోన్ అనేది సీఎం జగన్ అభిప్రాయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇద్దరు బీసీలను సీఎం మరోసారి రాజ్యసభకు పంపుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు ఉండాలనేది సీఎం జగన్ విధానమన్నారు.
పేద ప్రజలకు మరింత సేవ చేస్తా: తనను రాజ్యసభకు పంపుతున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్. కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని చెప్పారు. సీఎం జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.
"సీఎం జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు పరిమితమైన అంశం కాదు. దేశవ్యాప్తంగా బీసీల కోసం నేను పోరాడుతున్నాను. బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాను. నా పోరాటాన్ని గుర్తించి ఏపీ సీఎం జగన్ నాకు ఈ అవకాశం కల్పించారు."- ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
ECI Notification: ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 12న షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల ప్రక్రియ ఇలా..
- నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: మే 24
- నామినేషన్ల దాఖలుకు తుది గడువు: మే 31
- పరిశీలన: జూన్ 01
- ఉపసంహరణకు తుది గడువు: జూన్ 03
- పోలింగ్ తేదీ: జూన్ 10
(అదే రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు)
ఇవీ చూడండి