రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు ముఖ్యమంత్రి జగన్(cm jagan speech in southern zonal council meeting news). తిరుపతి వేదికగా హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ(southern zonal council meeting news)లో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రాల మధ్య సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయాలని కోరారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘విభజన చట్టంలో పొందుపరచిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాలి. అయితే 2013-14 అంచనాల ప్రకారమే నిర్మాణానికి నిధులిస్తామని, మిగిలిన వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని చెప్పడమంటే.. అప్పుడిచ్చిన హామీని ఉల్లంఘించడమే. తాగునీటికి సంబంధించిన కాంపొనెంట్ నిధుల్ని కూడా విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది’ అని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా.. ఇప్పటికీ వాటిని అమలు చేయకపోవడంతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది.’ అని వివరించారు. ‘దేశ సమగ్ర పురోగతికి కేంద్రం, రాష్ట్రాలతో పాటు.. అంతర్‌రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా మీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. ఈ సందర్భంగా జగన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తొలి ఆర్థిక సంవత్సరం 2015 - 16లో తెలంగాణ తలసరి ఆదాయం 15వేల 454 రూపాయలు ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం 8వేల 979 రూపాయలు మాత్రమే ఉందని గుర్తుచేశారు. విభజనతో ఏపీ ఏ స్థాయిలో నష్టపోయిందనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణగా పేర్కొన్నారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని... దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటోందని వివరించారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. ఆ మేరకు తగిన సహకారం అందించడం లేదన్నారు. పెరిగిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని సాంకేతిక సలహా కమిటీ, సవరించిన వ్యయ కమిటీ అనుమతించినా... కేంద్రం ఆమేరకు ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. విభజన నాటికి ఉన్న 16వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉంటే... కేంద్రం నుంచి 4వేల 117 కోట్లు మాత్రమే అందిందన్నారు. అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రకు రావాల్సిన 6 వేల 112 కోట్ల బకాయిలు ఇప్పించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కీలక హామీ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. షెడ్యూల్ 8, 9, 10 సంస్థల విభజన, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ వెంటనే ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి రుణాలు సేకరించారనే కారణంతో నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదని జగన్ అన్నారు. 2016-17లో పరిమితి మించినట్లు నిర్ధరణ అయితే అప్పుడే ఎందుకు కోత వేయలేదని ప్రశ్నించారు. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వహణకు తమిళనాడు నుంచి బకాయిలు ఇప్పించాలని, కుప్పంకు నీరందించే పాలారు ప్రాజెక్టు సమస్య పరిష్కరించాలని కోరారు. రేషన్ బియ్యం కేటాయింపులో కేంద్రం నిర్ణయాలు హేతుబద్ధంగా లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలమైన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌కు 10 శాతం ఎక్కువ రేషన్ సరుకులు ఇస్తున్నారని గుర్తుచేశారు.
''తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట ఇవ్వాలి. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదు. ఈ అంశంపై దృష్టిసారించాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోతలు విధిస్తున్నారు. ఈ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో హేతుబద్ధత లేదు. ఈ ప్రక్రియలో సవరణలు చేయాలి '' - దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్
సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2013–14 నాటి అంచనాలు కాకుండా ప్రస్తుత ధరలతో నిధులు కేటాయింపు.
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూలోటు (రీసోర్స్ గ్యాప్) 22,948.76 కోట్ల చెల్లింపు.
- కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలతో తెలంగాణకు పంపిణీ చేసిన విద్యుత్ బకాయిలు రూ.6,112 కోట్ల చెల్లింపు.
- రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా అమలు.
- బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ అమలు
- రెండు రాష్ట్రాల మధ్య వివిధ సంస్థల ఆస్తుల పంపిణీలో జోక్యం చేసుకోవాలి.
- చెన్నై నగరానికి తాగునీటి సరఫరా 10 ఏళ్ల బకాయిలు రూ.338.48 చెల్లించేలా జోక్యం చేసుకోవాలి.
- చౌకదాన్యం కేటాయింపులో మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్ తరహా విధానాన్ని అమలు చేయాలి.
ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే..
దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది(Southern Zonal Council Meeting news). ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్, తమిళనాడు విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇంఛార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి రాజన్, అండమాన్ నికోబార్ ఎల్‌జీ దేవేంద్ర కుమార్ జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి: SZC meeting: దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభం