ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు చేయూత అందించడం సహా సాధికారిత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్వయం ఉపాధి కల్పించేందుకు ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రభుత్వం మరో 2 దిగ్గజ కంపెనీలతో అవగాహాన ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ రిటైల్, జియో, అల్లాన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోఅవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రిలయన్స్ రిటైల్, జియో, అల్లానా సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.‘
కోటి మందికి లబ్ధి
వైఎస్సార్ చేయూత’ద్వారా మహిళా సాధికారికతకు రెండు దిగ్గజ కంపెనీల తోడ్పాటు అందిస్తాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మహిళా సాధికారిత కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అర్హులైన మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. 23 లక్షల మహిళలకు ఈ ఏడాది సుమారు రూ.4,300 కోట్లు ఇచ్చామన్నారు. వచ్చే నెలలో ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపిన సీఎం.. ఏడాదికి రూ.6700 కోట్లను సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తామన్నారు. నాలుగేళ్ల పాటు దాదాపు 93 లక్షల మహిళలను ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. దాదాపు రూ.11 వేల కోట్లు మహిళా సాధికారిత కోసం ఖర్చు చేస్తున్నామన్న సీఎం..దాదాపు కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు.
దిగ్గజ సంస్థల సహకారం
ఇప్పటికే అమూల్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్‌తో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పుడు రిలయన్స్, అల్లానా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయని.. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నది తమ ప్రయత్నమని, ప్రభుత్వం ఇచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలన్నారు. ఈ దిశగా దిగ్గజ సంస్థల సహకారాన్ని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
అనుసంధాన కర్తగా
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలయన్స్, అల్లానా గ్రూపు ముఖ్య అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంవోయూ చేసుకున్న దిగ్గజ సంస్థలు తాము అందించే సహకారాన్ని ప్రభుత్వానికి తెలియజేశాయి. మహిళల కిరాణా వ్యాపారానికి సహాయ సహకారాలు అందించనున్నట్లు రిలయన్స్ రిటైల్ తెలిపింది. దుకాణాల నిర్వహణ, వ్యాపార సమర్థతను పెంచడంలో మహిళలకు శిక్షణ ఇస్తామని వెల్లడించింది. కిరాణా దుకాణాలు నడుపుతున్న మహిళలకు సరసమైన ధరలకే ఉత్పత్తులు అందిస్తామని రిలయన్స్ రిటైల్ తెలిపింది. ఈ కార్యకలాపాల్లో అందరినీ అనుసంధానించేలా ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు జియో తెలిపింది. ప్రభుత్వం, లబ్ధిదారుల మధ్య నేరుగా అనుసంధాన వ్యవస్థ ఏర్పాటుతో కార్యకలాపాలు సాఫీగా జరిగేలా చూస్తామన్నారు.
సాంకేతిక సహకారం
ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలో తమకు విశేష అనుభవం ఉన్న దృష్ట్యా ఈ రంగంలో సేవలందించనున్నట్లు అల్లానా సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విశేష అనుభవం, భారీగా కంపెనీ నుంచి ఎగుమతులు వస్తాయన్నారు. 1865 నుంచి తమ కంపెనీ కార్యకలాపాలు చేపడుతోందని.. పాడి పశువుల పెంపకంలో సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు అల్లానా సంస్థ తెలిపింది. గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో సహకారం అందిస్తామని, తిరిగి వాటిని కొనుగోలు చేస్తామన్నారు.
చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాంక్షిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని దిగ్గజ సంస్థలు తెలిపాయి. స్థానికంగా ఉన్న చిన్న వ్యాపారులు కూడా లబ్ధి పొందాలన్నదే తమ విధానమని సంస్థలు ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి: