Sankranti Special Kodi Pandalu: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందేలు జరుగుతున్నాయి. సంక్రాంతికి వారం రోజుల ముందు నుంచే అక్కడక్కడా పందేలు నిర్వహించినా, భోగిరోజు అన్ని నియోజకవర్గాల్లోనూ పందేల నిర్వహణకు తెరలేపారు. భీమవరం, ఆకివీడు, కామవరపుకోట, కలిదిండి, దెందులూరు, పెదవేగి, పాలకొల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో కోడిపందేలతో పాటు గుండాటలు, ఇతర జూద క్రీడలు పెద్ద ఎత్తున సాగాయి.
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్స్లలో పందెంరాయుళ్లు బరుల వద్దకు చేరుకున్నారు. పెదఅమిరం, డేగాపురం, సీసలి, నౌడూరులో కోడి పందేల బరులు మినీ స్టేడియాలను తలపించాయి. 10 లక్షల రూపాయల నుంచి మొదలుకొని 25 లక్షల వరకు పందేలను నిర్వహించారు. కొత్తపాడు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు బరుల వద్ద కొంతసేపు హడావుడి చేయడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పందెంరాయుళ్లు, వచ్చిన వారు చూసేందుకు వీలుగా డిజిటల్ ఎల్‌ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు.
మరికొన్నిచోట్ల స్వయంగా ప్రజాప్రతినిధులే బరుల వద్దకి వచ్చి కోళ్లను దువ్వి జోరును మరింతగా పెంచారు. కోడి పందేలతోపాటు గుండాట, జూదం నిర్వహించారు. వేల సంఖ్యలో ఔత్సాహికులు కార్లలో పందేలు చూసేందుకు, ఆడేందుకు వచ్చారు. భీమవరం, వీరవాసరం, పోలవరం మండలాల్లోని కొన్ని బరుల వద్ద బుల్లెట్ బైక్, బంగారాన్ని బహుమతులుగా ప్రకటించారు. భోగిరోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు చేతులు మారింది. ఆయా బరుల వద్దకు ప్రజాప్రతినిధులు వచ్చి సందడి చేశారు.
‘బుల్లెట్’ గెలిచిన పందెంరాయుళ్లు: కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించిన కోడి పందేల పోటీల్లో పాల్గొన్న పలువురు పందెంరాయుళ్లు బుల్లెట్ ద్విచక్ర వాహనాలను సొంతం చేసుకున్నారు. ముదినేపల్లి మండలం బొమ్మినంపాడులో కోడిపందేల బరికి వచ్చిన కైకలూరు వాసి బుల్లెట్ గెలుచుకున్నారు. కైకలూరు మండలంలోని 11 కోడి పందేల్లో వరుసగా 6 పందేలు గెలిచిన మండవల్లి మండల వాసి కూడా బుల్లెట్ బైక్ సొంతం చేసుకున్నారు. అదే విధంగా మండవల్లి మండలం భైరవపట్నంలో కైకలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఎలక్ట్రిక్ బైక్ బహుమతిగా లభించింది.
కాలు దువ్విన పందెంకోళ్లు - కల్యాణ మండపాలలోనూ కొనసాగిన జోరు
బుల్లెట్ బండ్లు, థార్ జీప్ - కోడి పందేల్లో గెలిచినోళ్లకే లక్