CockFights in NTR District : మూడు రోజులుగా బరుల ధ్వంసం, నోటీసులతో పోలీసుల హడావుడి, కానీ భోగి రోజు అంతా వెనక్కి తగ్గారు. అంతే దాదాపు అన్ని మండలాల్లో బరులు వెలిశాయి. ఉమ్మడి జిల్లాలో సోమవారం కోడిపందేలు, జూద క్రీడలు జోరుగా మొదలయ్యాయి. పెద్ద, చిన్న బరులు వందల్లో ఏర్పాటయ్యాయి. కత్తి కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా పందెం రాయుళ్ల పంతమే నెగ్గింది.
కోడిపందేలు, జూదక్రీడలు భారీగా ఆడారు. కోతముక్కలో డబ్బు భారీగా చేతులు మారింది. మద్యం ఏరులైంది. బరుల వద్ద వ్యాపారమూ అలాగే జరిగింది. తొలిరోజు లావాదేవీలు రూ.కోట్లలో మాటే. ముఖ్య ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకూ దీపాల వెలుగుల్లో పందేలు సాగాయి. చాలాచోట్ల రాజకీయ పార్టీల ఆధ్వర్యంలోనే జరిగాయి.
భారీగా జూద క్రీడలు
- పెనుగంచిప్రోలులో ఓ ఏసీ ఫంక్షన్‌హాలులో పెద్దఎత్తున జూదం జరిగింది. దీనికి తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భారీగా పందెంరాయుళ్లు తరలివచ్చారు. జూదం ఆడే వారికి మూడు రోజుల వసతి, సకల సౌకర్యాలు కల్పించారు. పెద్ద ఆటకు రూ.10 వేలు ప్రవేశ రుసుము వసూలు చేశారు.
- టోకెన్లు ఉన్న వారినే అనుమతించారు. ఇక్కడ పందెం కాసేందుకు మహిళలూ వచ్చారు. చిల్లకల్లు, బలుసుపాడు, షేర్‌మహ్మద్‌పేట, నవాబుపేటలోనూ భారీగా జరిగాయి. కంచికచర్ల మండలం గండేపల్లిలో ఎంట్రీ ఫీజు కింద రూ.10 వేలు వసూలు చేశారు. జూదం, కోడి పందేలు భారీగా ఆడారు.
- బాపులపాడు మండలం అంపాపురంలో పది బరులు ఏర్పాటయ్యాయి. పెద్ద బరిలో ఒక్కో పందేనికి రూ.5 లక్షలుగా నిర్ణయించారు. తొలిరోజు 20 పందేలు వేశారు. వీఐపీ శిబిరంలో మద్యం, మాంసాహారం సరఫరా చేశారు.
- ప్రత్యేక ట్యాగ్ వేసిన వారినే లోపలకు అనుమతించారు. ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పందెం కాసేందుకు వచ్చారు.
జోరుగా కోడి పందేలు - చేతులు మారుతున్న లక్షలు
- కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, ఉయ్యూరు మండలం గండిగుంట, కాటూరు, బోళ్లపాడు, ఆకునూరుల్లో పందేలు భారీగా సాగాయి. నెంబర్లాట, గుండాట, కోతముక్క, తదితర జూదక్రీడలు జరిగాయి. మద్యం ప్రభావం అధికంగా ఉంది.
- ఈడుపుగల్లులో రూ.1-5 లక్షల వరకు జరిగింది. ఉప్పులూరులో కోడి పందేల బరికి మంత్రి పార్థసారథి కుటుంబ సభ్యులతో వచ్చి కాసేపు ఉండి వెళ్లిపోయారు. కంకిపాడులో పందేలు తిలకించేందుకు జబర్దస్త్ నటులు రాఘవ, అశోక్, మోహన్, నాగి తదితరులు వచ్చారు.
- గన్నవరం మండలం సూరంపల్లిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పందేలు కాశారు. ఎనికేపాడు, రామవరప్పాడు బరుల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. వీఐపీ గ్యాలరీల్లో టవర్ ఏసీలు కూడా సమకూర్చారు. ప్రవేశ రుసుము రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు.
- జూదశిబిరాల వద్ద గొడవలు జరిగాయి. అవనిగడ్డ మండలం పులిగడ్డ-పెనుమూడి వంతెన పక్కన శిబిరంలో పందెం డబ్బుల విషయంలో గొడవలు జరిగాయి. చల్లపల్లిలో చిత్తులాట శిబిరంలో కొట్లాట జరిగింది.
- గుడ్లవల్లేరు మండలం వేమవరంలో పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు 2 బుల్లెట్‌లు, ఐదు స్కూటీలు బహుమతులుగా ప్రకటించారు. బరుల్లో 5 సార్లు కోడిపందేలు వేయగా వరుసగా నాలుగుసార్లు గెలిచిన వ్యక్తికి నిర్వాహకులు బుల్లెట్‌ను బహుమతిగా ఇచ్చారు.