Sankranti Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు రావడంతో ప్రతి ఇంటా సందడి వాతావరణం నెలకొంది. ఇంటి ముంగిట కళకళలాడే రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు అలరిస్తున్నాయి. మహిళలు తెల్లవారుజాము నుంచే ఇళ్ల లోగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేశారు. తల్లిదండ్రులు చిన్నారులపై భోగిపళ్లు పోసి ఆశీస్సులు అందజేశారు. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికీ వెళ్లాయి.
ఎంత ఎదిగినా సంప్రదాయాలు మరిచిపోకూడదు: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వారికి విశిష్టమైన సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. పాడిపంటలతో విరజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈరోజు శాస్త్రపరంగా అన్ని విధాలుగా ప్రాముఖ్యత కలిగిందన్నారు. అందుకే మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలను పాటిస్తూ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకోవాలని అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలుగు వారికి విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో విరాజిల్లే పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నా మరచిపోని మన సాంప్రదాయాలను… pic.twitter.com/x3CsslwDYG
— N Chandrababu Naidu (@ncbn) January 13, 2025
తెలుగుదనాన్ని లోకమంతా చాటుదాం: తెలుగువారందరికీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అనేది రైతుల పండుగ అని, పాడిపంటలు ఇంటికొచ్చిన వేళ పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయన్నారు. ఇంటి ముంగిట కళకళలాడే రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు ప్రజలకు సంతోషాన్ని పంచాలని ఆకాంక్షించారు. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుదామని పిలుపునిచ్చారు. సంబరాల సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు.
తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది రైతుల పండుగ. పాడిపంటలు ఇంటికొచ్చిన వేళ పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇంటి ముంగిట కళకళలాడే రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. మీకు సంతోషాన్ని పంచాలి. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన… pic.twitter.com/gaUlGHX21s
— Lokesh Nara (@naralokesh) January 14, 2025
సంక్రాంతి సంతోష హరివిల్లులు నింపాలి: తెలుగు ప్రజలకు భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి అందరి జీవితాలలో భోగ భాగ్యాలు తీసుకురావాలని, సంక్రాంతి సంతోష హరివిల్లులు నింపాలని, కనుమ కలల సాకారం చేయాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మనకున్న అవినాభావ సంబంధాన్ని సంక్రాంతి గుర్తుచేస్తుందన్నారు.
నారావారిపల్లెలో దేవాంశ్ ఆటలు - మురిసిపోయిన చంద్రబాబు, భువనేశ్వరి
పండగంటే మూడు రోజుల ముచ్చట కాదు - ఇలా చేస్తే ఏడాదంతా ఎంతో హ్యాపీ