కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన కొన్ని అంశాల్లో 2030 నాటికి స్థిరమైన అభివృద్ధి సాధించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ అభిలాషించారు. విశాఖలో జరిగిన 69వ జాతీయ టౌన్ అండ్ కంట్రీప్లానర్స్ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కొవిడ్ వల్ల ఇంటి నుంచే పనిచేసే విధానం కొనసాగుతోందని...ఇది ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనికోసం భవిష్యత్‌లో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాలో సూచనలు ఇవ్వాలని కోరారు.
నగరాల్లో భరించలేని స్థాయిలో అద్దెలు, భూములు ధరలు పెరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. భూసేకరణ ప్రభుత్వానికి ఎంతో భారంగా మారిందని...దీన్ని తగ్గించేందుకు విలువైన సూచనలు ఇవ్వాలని సదస్సులో కోరారు. దీంతోపాటు పేద, మద్య తరగతి ప్రజలకు గృహ వసతి కల్పించడం, నగరాల్లో నీటి నిర్వహణ, ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న ఉద్గారాల తగ్గింపు కోసం సూచనలు కోరారు. సమగ్ర తీరప్రాంత అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రానికి ఉపయోగపడే సూచనలు ఇవ్వాలన్నారు.
మూడురోజుల పాటు జరగనున్న సదస్సులో చర్చించిన అంశాలు, సూచనలను కచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం హామీ ఇచ్చారు. మీ సలహాలు, సూచనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.
17 వేల లేఅవుట్లను అభివృద్ధి చేస్తాం
పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రసంగిస్తూ.. ప్రజల సొంతింటి కల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రెండు నెలల కిందట 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా కొద్ది నెలల్లో అన్ని సౌకర్యాలతో 17 వేల లేఅవుట్లను అల్పాదాయ వర్గాల కోసం అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మధ్య ఆదాయవర్గాలకు నమూనా లేఅవుట్లను అభివృద్ధి చేస్తామన్నారు. విశాలమైన రహదారులు, జిమ్, క్రీడా స్థలాలు, క్లబ్‌హౌస్ వసతులతో వీటిని తీర్చిదిద్దుతామన్నారు. పట్టణీకరణలో పారిశుద్ధ్య నిర్వహణ సవాలుతో కూడుకున్నదని, దీని కోసం రాష్ట్రంలో ‘క్లీన్ ఏపీ’ పేరిట 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మురుగునీటిని శుద్ధి చేసి, ఆ నీటిని మొక్కలు, వ్యవసాయ అవసరాలకు తిరిగి వినియోగించే విధానం 2022 ఆగస్టు నాటికి రాష్ట్రమంతటా అమలు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. ఐటీపీఐ అధ్యక్షుడు ఎన్‌కే పటేల్, ఉపాధ్యక్షుడు వి.రాముడు, కార్యదర్శి కుందాంకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి