పేదలకు న్యాయం అందడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... న్యాయ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా.. ఆకర్షణీయంగా ఉండాలని అన్నారు. న్యాయవాదులు.. న్యాయ సమానత్వం కోసం కృషి చేయాలని కోరారు. లా విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలతో స్వయంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకోవాలని సీజేఐ సూచించారు.
న్యాయం, హక్కుల సాధనకోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. యువత భవిష్యత్ గురించి కీలకమైన సూచనలు చేశారు. తమ శక్తిని ఉపయోగించుకునే మార్గమే.. యువత భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని చెప్పారు.
ఇక, నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంతో తనకున్న అనుబంధాన్ని జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు. ఈ వర్సిటీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. బర్కత్‌పురాలోని చిన్న భవనంలో ప్రారంభమైన కళాశాల.. ఇవాళ అత్యున్నత స్థాయికి ఎదిగిందని అన్నారు. ఈ స్నాతకోత్సవానికి.. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
"నల్సార్ న్యాయవిశ్వవిద్యాలయంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. న్యాయవిద్యను అభ్యసిస్తూ మీరంతా ఎన్నో విలువైన ఉపన్యాసాలు విన్నారు. చిన్ననాటి నుంచి సామాజిక స్పృహ ఉంటేనే న్యాయ విద్యకు సార్థకత చేకూర్చగలుగుతారు. చట్టం తెలుసుకుంటే సమాజంలో క్రమశిక్షణగా మెలగడమే కాదు ఆలోచనలో స్పష్టత, కచ్చితత్వం అంచనావేసేందుకు సహకరిస్తుంది. మాతృభాష గానీ మరే ఇతర భాషలలోనైనా సమాచార మార్పిడి సమర్థంగా ఉంటేనే న్యాయవాద వృత్తిలో రాణించగలుగుతారు. నిజాన్ని కనిపెట్టడం అంత కష్టం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలకు పరిష్కారం కనుగొనేలా న్యాయవిద్యలో కోర్సులను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది." -జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి