హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి ఈశ్వర ప్రసాద్ మృతి(87) పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నం.60లోని తన నివాస గృహంలో మంగళవారం గుండెపోటుతో మరణించారు.
న్యాయవాదిగా జీవితం ఆరంభం
జస్టిస్ ఈశ్వరప్రసాద్ 1934 ఆగస్టు 4న సాంబశివరావు, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి జిల్లా జడ్జి కాగా, తల్లి న్యాయవాది, సామాజిక సేవకురాలిగా గుర్తింపు ఉన్నవారు. తల్లిదండ్రుల గుణాలను పుణికిపుచ్చుకున్న ఈశ్వరప్రసాద్ న్యాయరంగం, సేవారంగంలోనూ విశేష సేవలందించారు. నాడు మద్రాసులో బి.ఎ. చేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1959లో న్యాయవాదిగా జీవితం ఆరంభించిన ఆయన రాజ్యాంగ, సివిల్, ట్యాక్స్ వివాదాలకు సంబంధించిన కేసుల్లో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు వినిపించారు. 31 ఏళ్ల అనంతరం 1990 మార్చిలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1994లో కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లి అక్కడే 1996లో పదవీ విరమణ చేశారు.
కీలక తీర్పులు
సెక్యులరిజం-ప్రభుత్వ పాత్రతో సహా పలు క్రిమినల్, సివిల్ కేసుల్లో చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు. 1997లో భూఆక్రమణల నిరోధక చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్లీలోని జప్తు చేసిన ఆస్తులకు చెందిన అప్పిలేట్ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా 2003 వరకు విధులు నిర్వహించారు. స్మగ్లర్లు, నేరస్థుల ఆస్తుల జప్తుపై కీలక తీర్పులు వెలువరించారు. సమర్థంగా పనిచేసే జస్టిస్ ఈశ్వరప్రసాద్‌ను అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సైతం అభినందించారు.
సేవా కార్యక్రమాలు
శ్రీసత్యసాయి సేవాసంస్థల కార్యదర్శిగా పలు ధార్మిక, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఉచిత వైద్యం, ధార్మిక చైతన్యం, విద్యాప్రమాణాలు పెంపు, మానవ సంబంధాలను పెంపొందించే దిశగా ప్రయత్నించే కార్యక్రమాలు చేపట్టారు. తల్లి సీతామహాలక్ష్మి పేరుతో ట్రస్టు స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. జస్టిస్ ఈశ్వరప్రసాద్ భార్య జె.చామంతి ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. దిల్లీ వనితామండలి అధ్యక్షురాలిగా అనాథ పిల్లలకు ఆసరా కల్పించారు. జస్టిస్ ఈశ్వరప్రసాద్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతిక కాయానికి మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:phone number: నా ఫోన్ నంబర్ నాకు ఇస్తారా? చావమంటారా?!