Chikoti Praveen at ED Office : క్యాసినో కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డిలను ఇవాళ మరోసారి విచారించనుంది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని చీకోటి మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు చీకోటి తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు. మాధవ రెడ్డి హాజరుపై తనకు సమాచారం లేదని.. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ప్రవీణ్ స్పష్టం చేశారు. అనంతరం చీకోటి ముఖ్య అనుచరులు మాధవ రెడ్డి, సంపత్‌లు ఈడీ ముందు హాజరయ్యారు.
మొదటి రోజు విచారణలో ఈడీ అధికారులు.. ప్రధానంగా క్యాసినో దందాలో విదేశీ లావాదేవీలు, హవాలాకు సంబంధించి తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బట్టి ప్రవీణ్ బృందాన్ని విచారించినట్టు సమాచారం. క్యాసినోలు నిర్వహిస్తూ ప్రముఖులను చార్టర్ విమానాల్లో నేపాల్, బ్యాంకాక్ తరలించడం, పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం దారి మళ్లింపు, బంగారం అక్రమంగా దేశంలోకి తీసుకురావడం, హవాలా కార్యకలాపాలు తదితర అంశాలపై ప్రధానంగా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించినట్లు సమచారం.
హవాలా ద్వారా నగదు బదిలీ వ్యవహారంలో ఈడీ అధికారుల ప్రశ్నలకు ప్రవీణ్, మాధవరెడ్డి తడబడినట్టు తెలుస్తోంది. క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారకద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం తీసుకువెళ్లడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చేవారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్దం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది.