స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించటంతో పాటు కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు కేసులు పెట్టి, బలవంతంగా విత్ డ్రాలు చేయించిందని ఆరోపించారు. గతంలో జరిగిన ఈ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎస్ఈసి ఇటీవల రాష్ట్రంలో వివిధ పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ మెజారిటి పార్టీలు అవే అభిప్రాయాలను వెల్లడించాయని గుర్తు చేశారు. పార్టీ ముఖ్యనేతలు నియోజకవర్గ ఇంఛార్జీలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైకాపా ప్రజావ్యతిరేక చర్యలకు గుణపాఠం చెప్పాలని... ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి నుంచే నాంది పలకాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్లక్ష్యం...
పోలవరం ఎత్తు 41.15మీటర్లకు తగ్గిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టమని చంద్రబాబు స్పష్టం చేశారు. "ఉత్తరాంధ్ర, సీమ జిల్లాల నీటి కొరత తీరాలంటే పోలవరం పూర్తి కావాలి. కమిషన్ల కక్కుర్తితో 71శాతం పూర్తి చేసిన పనుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రాజెక్టు పూర్తయితే విశాఖ సహా ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. ఆర్ అండ్ ఆర్తో కలిపి పోలవరం నిర్మాణ వ్యయం రూ.55వేల కోట్లకు తెదేపా ఆమోదం సాధిస్తే వైకాపా మళ్లీ మొదటికి తెచ్చింది.
పునరావాసం కింద ప్రతి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తామని నమ్మించి ఇప్పుడు మాట మార్చటంతో పాటు పోలవరం ఎత్తు తగ్గించినా పర్వాలేదనటం నమ్మకద్రోహమే. పంచ నదుల అనుసంధానం పనులు కొనసాగిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా సస్యశ్యామలమయ్యేవి. రాజ్యసభతో కలిపి మొత్తం 28మంది ఎంపీలున్నా అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదాపై కేంద్రం వద్ద నోరు మెదకపోవటాన్ని ప్రజల్లో నిలదీయాలి." అని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రే వాటాలు కుదుర్చుతున్నారు..
వైకాపా నేతల అవినీతి పంపకాల్లో తేడాలు వస్తే ముఖ్యమంత్రే స్వయంగా పంచాయితీలు చేసి వాటాలు కుదుర్చుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. "పేకాట క్లబ్బుల నిర్వహణ, ఇసుక అక్రమ తవ్వకాలు, మద్యం అమ్మకాల్లో, ఇళ్ల స్థలాలకు పేదల నుంచి వసూళ్లలో అవినీతి, అక్రమ సంపాదనలో వాటాల కోసం వైకాపాలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. పంపకాల తేడాతో నాయకులు రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు.
వాటాల కోసం చంపుకునే దాకా వెళ్లారు. ఇడుపులపాయలో కుమ్ములాటలు, విశాఖపట్నంలో పంచాయితీలు, గండికోట ముంపు బాధితుల పరిహారం స్వాహాలో దాడులు చేసుకుని హత్యల దాకా వెళ్లారు. ఉన్మాదుల పాలనలో దుర్మార్గాలు జరగడం పరిపాటి అయ్యింది. పోలీసులు కూడా నిర్వీర్యమై అధికార పార్టీ నేతలు ఏం చెబితే అది చేస్తున్నారు. 25ఏళ్ల పీపీఏలపై తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించి 30ఏళ్లకు వైకాపా ఒప్పందం చేసుకోవటం మోసం.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడ్తామనటం నమ్మక ద్రోహాలకు పరాకాష్ట. వైకాపా వేధింపులు తట్టుకోలేకే వివిధ వర్గాల వారి ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. లాటరీలో పేదలకు ఇళ్లు కేటాయించకుండా బలవంతంగా స్వాధీనం చేసుకునే పరిస్థితి తెచ్చారు. లబ్దిదారులు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం తగదు. పరిపాలన చేతకాక, చట్టాలు తెలుసుకోకుండా, న్యాయస్థానాలపై గౌరవం లేకుండా అహంభావంతో ప్రవర్తిస్తున్నారు.
పింఛన్లు ఆపేసి, రేషన్, అమ్మఒడి నిలిపివేస్తామంటూ పేదలను బెదిరించే పాలకులను ఇప్పుడే చూస్తున్నాం. శారదా పీఠం అధిపతి జన్మదినంపై దేవాదాయ శాఖ ఇచ్చిన మెమోను న్యాయస్థానం సస్పెండ్ చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. సొంత మీడియాకు ప్రకటనలిచ్చేందుకు నిధుల విడుదల కోసమే తప్పుడు పథకాలను సృష్టిస్తూ ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారు. గత నరేగా బిల్లులు నిలిపివేయటం మంచిది కాదు. బిల్లుల చెల్లింపులు ఏకారణంతో ఆగినా తెదేపా ప్రభుత్వం వచ్చాక 24 శాతం వడ్డీతో చెల్లింపులు చేస్తుంది." అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు