కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనా రెండో దశ ఉద్ధృతితో అంతా భయపడిపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వ్యాక్సిన్ సక్రమంగా అందట్లేదన్న ఆయన.. అనేక రంగాల వారు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడే సందర్భంగా టీఎన్టీయూసీ నేతలతో వర్చువల్గా సమావేశమైన చంద్రబాబు.. పలు అంశాలపై మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత కార్మికులంతా జరపుకొనే పండగ మేడే అని..కార్మిక దోపిడీకి స్వస్తి పలికిన రోజు అని తెలిపారు.
ఆందోళనలో విద్యార్థులు...
కరోనా క్లిష్టపరిస్థితుల్లో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్ కూడా వేసుకోని విద్యార్థులను పరీక్షలకు రమ్మంటున్నారని.. ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. సంక్షోభాన్ని నివారించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించే స్థాయికి వచ్చారని దుయ్యబట్టారు. ప్రాణాలే లేనప్పుడు ఇక భవిష్యత్తు ఎక్కడుంటుందని ప్రశ్నించారు.
'రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి మరణమూ ప్రభుత్వ హత్యగా భావించాలి. ఎవరైనా కరోనాపై మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. శ్మశానాల్లో శవాలను క్యూలో పెట్టే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం' - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి