ప్రభుత్వ విచ్చలవిడితనం వల్ల ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. పార్టీ నేతలతో నివర్ ప్రభావంపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని విమర్శించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైనా, ప్రజాపక్షంగా బాధ్యత నిర్వర్తించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకుంటూ తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించారు. మనోనిబ్బరం పెంచి, భవిష్యత్‌పై భరోసా కల్గించాలన్నారు. నష్టం వివరాలు సేకరించటం, నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్ల వీడియోలు తీసి, స్థానిక అధికారులకు వాటిని అందచేసి నష్టం అంచనా చేపట్టేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.
20 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఖరీఫ్‌లో వచ్చిన వరుస విపత్తులతో 20 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు చేతికి అందివచ్చే సమయంలో నివర్ తుపాన్ బీభత్సం సృష్టించిందన్న ఆయన... అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ ఏడాది వరుసగా ఇది నాలుగో విపత్తు అని గుర్తు చేశారు. తల్లడిల్లిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో పాలకుల తీరు ప్రజలకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది విపత్తు నష్టాలకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.
నిర్లక్ష్యం క్షమార్హం కాదు
10 జిల్లాలు, 300 మండలాల్లో, 5 లక్షల ఎకరాల్లోని పంటలను నివర్ తుపాను ముంచేసిందన్న చంద్రబాబు... వరి, పత్తి, మిరప, పొగాకు, శనగ, వేరుశనగ, అరటి, మామిడి పండ్లతోటలు,ఉద్యానపంటలు పూర్తిగా దెబ్బతినటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా పాలనలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా విపత్తులను ముందుగా అధ్యయనం చేసి పరిష్కార వేదిక ద్వారా ముందస్తు హెచ్చరికలతో నష్ట నివారణ చర్యలు చేపట్టేవాళ్లమని చంద్రబాబు గుర్తు చేశారు. వైకాపా ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. విపత్తు బాధితుల పట్ల నిర్లక్ష్యం క్షమార్హం కాదన్న ఆయన... నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
బాధితుల బాధలు
సమావేశంలో పాల్గొన్న నాయకులు పునరావాస శిబిరాల్లో సదుపాయాలు లేక బాధితులు పడుతున్న ఇబ్బందులపై చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడలో 20 బోట్లలో వేటకు వెళ్లిన వాళ్లు తిరిగిరాలేదని వివరించారు. అకస్మాత్తుగా నీటిని వదలడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు, బుగ్గవంక ఇన్ఫ్లోలతో అపార నష్టం జరిగిందని తెలిపారు. పించా ప్రాజెక్టుకు గండి పడిందని ఆయా ప్రాంతాల నాయకులు వెల్లడించారు.
ఇదీ చదవండి