మన విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి ప్రపంచవ్యాప్తంగా ఆయా సాంకేతికతల్లో వారు భారీ సంఖ్యలో ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దడం ఈ తర్ఫీదు ఉద్దేశం. ఇందుకోసం రానున్న 20-30 ఏళ్లపాటు డిమాండ్ ఉండే వర్ధమాన సాంకేతికత (ఎమర్జింగ్ టెక్నాలజీ)లను 30 వరకు ఏఐసీటీఈ గుర్తించింది. శిక్షణ కాలం 3-6 నెలలపాటు ఉంటుంది. డిగ్రీ, ఆపై స్థాయి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్ కూడా ఇస్తారు. సాంకేతిక విద్యలో ముందంజలో ఉన్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈ శిక్షణ మరింత ప్రయోజనకరంగా మారుతుందని మల్లారెడ్డి గ్రూపునకు చెందిన ఓ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర తెలిపారు.
రెండు రాష్ట్రాల్లో ఏటా కేవలం బీటెక్‌లోనే లక్షన్నర మంది ప్రవేశాలు పొందుతున్నారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్, ప్రైవేటు వర్సిటీల్లో చేరే వారు మరో 15 వేల మంది ఉంటారని అంచనా. ఇదీ కార్యక్రమం..
లక్ష్యం: భవిష్యత్తులో డిమాండ్ ఉండే వర్ధమాన సాంకేతికతల్లో కోటి మంది విద్యార్థులకు శిక్షణ.
ఎవరు అర్హులు: 7వ తరగతి నుంచి డిగ్రీ, ఆపై స్థాయి విద్యార్థులు అర్హులు. ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు బేసిక్స్, ఆపై తరగతుల వారికి అడ్వాన్స్‌డ్, ఎక్స్‌పర్ట్ స్థాయి శిక్షణ ఇస్తారు. విద్యార్థులను పాఠశాల స్థాయి, ప్రస్తుతం ఉన్నత విద్య చదువుతున్న, తాజాగా ఉన్నత విద్య పూర్తి చేసిన వారుగా విభజించారు.
శిక్షణ ఇచ్చేది ఎవరంటే: డిజిటల్ స్కిల్లింగ్ పేరిట ఏఐసీటీఈ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏఐసీటీఈ వెబ్‌సైట్లో వివరాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్ కోసం పేర్లు నమోదు చేసుకోవాలి.
శిక్షణకు సహకారం: నాస్కామ్ ద్వారా ఆయా ఐటీ, ఇతర సంస్థలు ఈ శిక్షణ ఇస్తాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాన్‌ఫర్డ్ లాంటి వర్సిటీలు కూడా ముందుకొచ్చాయి. కొన్ని టెక్నాలజీల్లో శిక్షణను పలు సంస్థలు ఇస్తున్నాయి. ఎవరి వద్ద నేర్చుకోవాలన్నది విద్యార్థుల ఇష్టం. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఐబీఎం తదితర 63 సంస్థలు ముందుకొచ్చాయి. ఇంకా మరో 200 కంపెనీలు వస్తాయని ఏఐసీటీఈ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
వచ్చే 10-15 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అవసరాలు పెరుగుతాయో లోతుగా అధ్యయనం చేశాం. వాటికి అనుగుణంగా విద్యార్థులు 30 రకాల సాంకేతికతలపై పట్టు పెంచుకోవాల్సి ఉంటుందని గుర్తించాం. కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్- డేటా సైన్స్ తదితరాలతోపాటు తయారీ(మాన్యుఫాక్చరింగ్) పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు కోర్సులను రూపొందించాం. వాటిలో ప్రపంచంలోని ఉత్తమ సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటివి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ శిక్షణ, సర్టిఫికెట్‌కు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ సంస్థ 50 లక్షల మందికి ఉచితంగా శిక్షణ, సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధమైంది. గత కొద్ది సంవత్సరాల్లో అతి పెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు భారత్‌లో పరిశ్రమలు స్థాపించాయి. వాటికి కూడా నిపుణులైన మానవ వనరులను అందించడానికి ఈ శిక్షణ దోహదపడుతుంది. - బుద్ధా చంద్రశేఖర్, చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్, ఏఐసీటీఈ
ఇదీ చదవండి: