Budget Impact On Ap: కేంద్ర ప్రభుత్వం ఏపీకి మళ్లీ టోపీ పెట్టింది. ఈసారి బడ్జెట్‌లోనూ, దగా చేసింది. ఆర్థికలోటుతో కునారిల్లుతున్న రాష్ట్రంపై మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర విభజన గాయాల నుంచి కోలుకోలేక ఆర్థిక లోటులో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌పై... కేంద్రం కనీస కనికరం కూడా చూపలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మాట మాత్రంగానైనా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదు. ప్రత్యేక హోదా, రామాయపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం ఇలా విభజన హామీల్లో ఏ ఒక్కటీప్రకటించలేదు. పోనీ... ప్రత్యేక కేటాయింపులేమైనా చేశారేమోనని బడ్జెట్ పత్రాలన్నీ వెతికితే అరకొర కేటాయింపులు, మొక్కుబడి విదిలింపులూ తప్ప... ఒరిగిందేమీ లేదు. గతేడాది బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ప్రాజెక్టు ప్రస్తావనా..లేదు. గత బడ్జెట్ ప్రసంగంలో ఖరగ్‌పూర్-విజయవాడ, ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు రవాణా కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అవి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయి కాబట్టి ఏపీ గురించి ప్రస్తావించారు. ఈసారి కనీసం అలాంటి ప్రాజెక్టుకూ నోచుకోలేదు. గత బడ్జెట్‌లో ప్రకటించిన రెండు రైలు రవాణా కారిడార్ల పనులు ఇంకా పట్టాలెక్కలేదు. చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టులో మాత్రం కొంత కదలిక ఉంది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల గురించిగానీ, రాష్ట్రంలోని విమానాశ్రయాలకు.. అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటామనిగానీ... పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రాజెక్టుల్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటామని గానీ.. పొరపాటున కూడా బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదు.
కేంద్రం నిర్లక్ష్యంతో వెనుకబడిన నవ్యాంధ్ర..
ఇంకో రెండేళ్లు గడిస్తే... రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతుంది. ఒక రాష్ట్రం అభివృద్ధి ప్రస్థానంలో పదేళ్లంటే తక్కువ సమయమేమీ కాదు.హైద్రాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఆర్థికంగా అండంగా నిలిచే పెద్ద నగరాలేమీ లేక, రాజధాని అమరావతి నిర్మాణం కూడా నిలిచిపోవడంతో ఇప్పటికే బాగా వెనుకబడిన నవ్యాంధ్ర కేంద్రం నిర్లక్ష్యంతో వల్ల ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే రోజు రోజుకీ మరింత వెనకబడుతోంది. ప్రత్యేక హోదా కల్గిన ఈశాన్య రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహ కేటగిరీ కింద... కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని పరిశ్రమలకు తిరిగి చెల్లించేందుకు 2022-23 బడ్జెట్‌లో 3వేల 631 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇతర రాయితీల కిందా పలు కేటాయింపులు జరిపింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీకి కూడా అలాంటి ప్రోత్సాహకాల్లో కొన్నయినా వచ్చేవి. రాష్ట్రంలోని... ఏడు వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించీ.. బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
మెట్రో రైళ్ల విషయంలోనూ అన్యాయం..
రాష్ట్రంలో విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు.. కేంద్రం ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. గత బడ్జెట్‌లో బెంగళూరు, చెన్నై, కోచితో పాటు, మహారాష్ట్రలోని నాగపూర్, నాసిక్ మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేసింది. 2021-22 సవరించిన బడ్జెట్ అంచనాల్లో మెట్రో ప్రాజెక్టులకు రూ.18,978 కోట్లు కేటాయించినట్టు చూపించింది. ప్రస్తుత బడ్జెట్‌లోనూ వివిధ మెట్రో ప్రాజెక్టులకు రూ.19,130 కోట్ల కేటాయింపులు జరిపింది. కానీ విజయవాడ, విశాఖ మెట్రో రైళ్ల గురించిన ఊసెత్తలేదు. మెట్రో రైళ్ల విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం మరోసారి అన్యాయం చేసింది.
విభజన హామీల్లోనూ పాత వైఖరే..
విభజన హామీల్లో వేటినీ ప్రకటించకపోగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపైనా కేంద్రం పాత వైఖరినే కనబరిచింది. ఈ తీరుతో మరో 20 ఏళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? అనే సందేహాలు... ప్రజల్లో కలుగుతున్నాయి. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2021-22 బడ్జెట్‌లో రూ.54.10 కోట్లు కేటాయించి... సవరించిన అంచనాల్లో రూ. 14.11 కోట్లు మాత్రమే చూపింది. ఈ బడ్జెట్‌లో రూ.56.66 కోట్లు... కేటాయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయాలకు గత బడ్జెట్‌లో రూ.50.50 కోట్లు ప్రతిపాదించి... సవరించిన అంచనాల్లో దాన్ని 9.74 కోట్లుగా చూపింది. ఈ బడ్జెట్‌లో రూ.44 కోట్లు ప్రతిపాదించింది. కొత్తగా ఒక్క సంస్థనూ రాష్ట్రానికి ప్రకటించని కేంద్రం ఇది వరకే మంజూరు చేసిన విద్యా సంస్థలను వేగంగా పూర్తి చేసేందుకూ.. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులేమీ చేయలేదు.
ఇదీ చదవండి: CBN ON FINANCIAL SURVEY: ఆర్థిక సర్వేలో ఏపీ స్థానం దిగజారడం బాధాకరం: చంద్రబాబు