తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును ఆమోదించేందుకు శాసనసభ, మండలి కొలువుదీరనున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు రెండు సభలు సమావేశమవుతాయి. సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగిస్తారు. తొలిరోజు సభ కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమవుతుంది. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు.
12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు!
ఇందుకోసం రెండు సభల సభా వ్యవహారాల సలహాసంఘాలు సమావేశమవుతాయి. సభాపతి, మండలి చైర్మన్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు జరిగే తేదీలు, సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన, అమోదించాల్సిన అంశాలు, బిల్లులను ఖరారు చేస్తారు. పది నుంచి 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల మరణించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు దివంగత నోముల నర్సింహయ్యకు ఈ నెల 16న శాసనసభ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ నెల 17న చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండే అవకాశం ఉంది.
18న బడ్జెట్!
18న 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఏసీ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ, ఆమోదంతో పాటు ఇతర అంశాలపై ఉభయసభల్లో చర్చ ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని ఇప్పటికే నిర్ణయించారు. అందరూ మాస్కులు విధిగా ధరించాల్సి ఉంటుంది.
కొవిడ్ పరీక్షలు తప్పనిసరి
సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశారు. సభలోపల, ప్రాంగణంలో రోజుకు రెండు మార్లు శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మారు సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. కరోనా కారణంగా గత బడ్జెట్ సమావేశాలు అర్ధాంతరంగా ముగిశాయి. కాగ్ నివేదికను ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టలేదు. ఫలితంగా ఈసారి రెండేళ్లకు సంబంధించిన కాగ్ నివేదికలను ఉభయసభల ముందుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: