Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి, ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతారని ఆశించినట్లు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా.. భాజపాను ఏమీ చేయలేరన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం సభ అనగానే రెండ్రోజుల నుంచే భాజపా నాయకులను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. సీఎం సభ అంటే రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. అభివృద్ధిపై కాకుండా భాజపాపై మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. విచారణ జరుపుతుందనే భయంతో తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుతున్నారన్నారు. యూపీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదో యాదాద్రిలో ఇవాళ జరిగే సభలో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ చెల్లని రూపాయి.. ఎవరూ ఆయన మాటలు పట్టించుకోరు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతారని ఆశించా. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుంది. విచారణ జరుపుతారనే భయంతో సెంటిమెంట్ వాడుతున్నారు. దేశం నుంచి ప్రధాని మోదీని తరిమికొట్టడం కాదు. తెలంగాణ నుంచి నిన్ను తరిమికొట్టకుండా చూసుకో.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు