తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ రాష్ట్రానికి చెందిన భాజపా నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి వచ్చిన అరుణ్ బరోకా నేతృత్వంలోని కేంద్ర బృందంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘తొలుత కేసులు అధికంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు తగ్గుతున్నాయి. ఈ పరిణామం మంచిదే.. కానీ, ఇదెంత వాస్తవమో తెలియదు. పొరుగు రాష్ట్రంలో ఇక్కడికంటే కేసులు పెరిగాయి. తెలంగాణలో పరీక్షలు సరిగా చేయట్లేదన్న అనుమానాలున్నాయి. మృతదేహాలకు సంబంధించి పరీక్షల నిర్వహణలోనూ కేంద్రం మార్గదర్శకాల్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించట్లేదు’’ అని వారు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో పీపీఈ కిట్లు సరిపడా ఉన్నాయా? లేదా? తెలియదు. ర్యాండమ్ పరీక్షలు చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లుగా కేసుల సంఖ్యలో తగ్గుదల వాస్తవమేనా?’’ అని కేంద్ర బృందాన్ని ఆరా తీశారు.
రాష్ట్ర ప్రభుత్వం కేసుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తోందని.. పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు కాన్ఫరెన్స్ అనంతరం భాజపా నేతలు విలేకరులకు తెలిపారు. తాము ప్రస్తావించిన అంశాలను అధికారులు నమోదు చేసుకున్నారని, వాటిపై విచారణ చేయిస్తామని చెప్పారని వారు వెల్లడించారు.
ఇదీ చూడండి: