Muralidhar: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని భాజపా జాతీయ నేత మురళీధర్‌రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసుపై స్పందించిన ఆయన.. తమ పార్టీ నేతలపై కేసులు బనాయించే కుట్ర జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారమే రాష్ట్ర భాజపా నేతలపై కేసులు పెట్టారన్న మురళీధర్ రావు.. రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరగాలన్నారు.
దర్యాప్తు మొదలు కాక ముందే.. ఈ కేసులో భాజపా నేతలు ఉన్నారని పోలీస్ కమిషనర్ చెప్పడంతోనే వాళ్ల వైఖరి ఎలా ఉందో తెలుస్తోందని మండిపడ్డారు. హత్యా రాజకీయాలను భాజపా ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులపై హత్య కేసులు మోపడం తెలంగాణలో తొలిసారిగా జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అనేక అవినీతి, భూ ఆక్రమణ, ఎన్నికల అక్రమాల కేసు ఉన్నాయని ఆరోపించారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి పేర్లను సైబరాబాద్ పోలీసులు ప్రస్తావించడం దుస్సాహసం అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: chandrababu : 'రైతులు నష్టపోతే.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు'