భూదాన్ పోచంపల్లి (bhoodan pochampally) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ గ్రామం. ఇటీవలే మున్సిపాలిటీగా అవతరించింది. సిల్క్సిటీగా పేరొందింది. 1910లో అసఫ్ జాహీల కాలంలో పోచంపల్లిలో చీరల పరిశ్రమ ఏర్పడింది. భూదానోద్యమంతో పోచంపల్లి... భూదాన్ పోచంపల్లిగా గుర్తింపు పొందింది. పోచంపల్లి చీరకి మగువల మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నేతన్నలు టై అండ్ డై తో వస్త్ర ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తేలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర ఉంది.
చేనేతే జీవనాదారం
గ్రామీణ వాతవారణం, కుల వృత్తులకు నిలయమైన పోచంపల్లి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి జీవన స్థితిగతులను తెలుసుకోటానికి ప్రపంచ దేశాల పరిశోధకులు క్షేత్ర స్థాయి పర్యటనకు పోచంపల్లిని సందర్శిస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,294 చేనేత (handloom) మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లి (bhoodan pochampally)లోనే ఉన్నాయి. గ్రామ జనాభాలో 65 శాతం మంది నేత కార్మికులే (handloom workers) ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధికంగా పోచంపల్లిలోనే ఉన్నారు.
ఇక్కత్ వస్త్రాలకు పేటెంట్ పొందిన గ్రామం
పోచంపల్లి ఇక్కత్ టై అండ్ డై పరిశ్రమకు (Ikat tie and dye industry) పెట్టింది పేరు. ఈ వస్రాలకు పేటెంట్ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 2003లో ఇక్కడి వస్త్రాల డిజైన్లకు పేటెంట్ లభించింది. గడిచిన రెండు మూడేళ్లలో భోగ బాలయ్య, సాయని భరత్, భారత వినోద్ సహా పలువురు రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకున్నారు. పోచంపల్లి చేనేత కళాకారులు నేసిన అనేక రకాల ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సాంప్రదాయ, చేనేత, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇక్కడి ప్రజలు జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు.
పోచంపల్లి.. భూదాన్ పోచంపల్లిగా ఎలా మారింది..
1951లో ఆచార్య వినోబాబావే (Acharya Vinobabave) చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికి ఈ గ్రామం నాంది పలికింది. ఇక్కడి భూదాత వేదిరె రామచంద్రారెడ్డి వినోబాభావే పిలుపుమేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి స్వీకరించి భూమిలేని పేదలకు పంచిపెట్టారు. ఈ గ్రామం భూదానోద్యమంతో భూదాన్ పోచంపల్లిగా మారింది. గ్రామంలో ఓ మ్యూజియం కూడా ఉంది. పర్యాటక శాఖ దీన్ని నిర్వహిస్తుంది. తమ గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపిక కావటం పట్ల అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ గ్రామానికి మంచి గుర్తింపు తో పాటు పర్యాటకులు కూడా పెరిగే అవకాశం ఉంటుందని పోచంపల్లి స్థానికులతో పాటు అధికారులు భావిస్తున్నారు.
ప్రపంచ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరికీ చేనేత పరిశ్రమే జీవనాదారం. ఈ పురస్కారం దక్కడం వల్ల గ్రామంలో మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మేము ఆశిస్తున్నాం. పోచంపల్లి పరిసర గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. - చింతకింది రమేశ్, చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి
పోచంపల్లి చేనేత చీరలకు ప్రసిద్ధి గాంచినది. ఇక్కడికి చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయ పురస్కారం దక్కడంతో పర్యాటకులు మరింత మంది వస్తారు. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. - జితేందర్, టూరిజం మేనేజర్.
పురస్కారం వల్ల లాభం ఏమిటంటే..
గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (United Nations World Tourism Organization) ఆధ్వర్యంలో బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ (Best Tourism Village Contest) నిర్వహించింది. సాంఘిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి, గ్రామీణ సాంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు, గ్రామీణ పర్యాటకానికి ఎంత ప్రాధాన్యత ఉంది. గ్రామీణ పర్యటకానికి ఊతం ఇచ్చేలా వాటి అభివృద్ధి, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనశైలి, నూతన పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ పోటీలు నిర్వహించింది. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన, సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటంతో బాటు ఆర్థిక అసమానతల తొలగింపు ఈ పోటీ ఉద్దేశం. బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్కు తెలంగాణలోని భూదాన్ పోచంపల్లితో పాటు మేఘాలయాలో "కాంగ్ థాన్" మధ్యప్రదేశ్ లోని చారిత్రాత్మక గ్రామం "లాద్ పురా ఖాస్" కూడా పోటీలో ఉన్నాయి. వీటిని పరిశీలించిన ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.
ప్రముఖుల అభినందనలు
ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావటంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోచంపల్లికి అవార్డు రావటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకి దక్కిన అత్యంత అరుదైన గౌరవం అని అన్నారు. పోచంపల్లి పర్యాటక గ్రామంగా గుర్తింపు రావడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పోచంపల్లి గ్రామ ప్రజలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి రానున్నారు. చేనేత ద్వారా ఆధునిక డిజైన్లు వేయటం ఇక్కడి నేతన్నల వృత్తి నైపుణ్యాలను ప్రతీక.
ఇదీ చూడండి: