Bio Asia Summit: నేడు నిర్లక్ష్యం చేసిన వ్యాధులే.. రేపు ప్రాణాంతక మహమ్మారులుగా ప్రబలుతాయని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. బయో ఆసియా సద్ససులో భాగంగా నిర్వహించిన 'టూ ఇయర్స్ ఇన్ పాండమిక్' ప్యానల్ డిస్కషన్లో ఆయన పాల్గొన్నారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇలాంటి వ్యాధులే పాండమిక్‌గా రూపుదాల్చాయంటూ ఆయన ఉదహరించారు. పరిస్థితులు చేజారకుండా ఉండాలంటే.. వ్యాక్సిన్ తయారుదారులు, పాలసీ మేకర్స్.. వీటిపై దృష్టిసారించాలని కృష్ణ ఎల్ల సూచించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న ట్యూబర్కులోసిస్ (TB) వ్యాక్సిన్.. ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరో వారంలో దీనిపై ప్రకటన ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో తమకున్న బీఎస్ఎల్-3 తయారీ కెపాసిటీని.. తమ భాగస్వామ్యంతో ప్రపంచ దేశాలు వినియోగించవచ్చని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
ట్రాక్ రికార్డ్..
భారత్‌లో వ్యాక్సిన్ల అభివృద్ధిలో అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతమైతే.. తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ టీకా ఇంకా ముందే అందుబాటులోకి వచ్చేదని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. వైరల్, ఇనాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్ల తయారీలో తమకున్న ట్రాక్ రికార్డుతోనే కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి నడుంబిగించామని ఆయన తెలిపారు. భారత్ బయోటెక్‌కు ఉన్న సానుకూలతలు, పూణా వైరాలజీ, ఐఐసీటీ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. 26 వేలకు పైగా మందికి వ్యాక్సిన్ ఎఫికసీ ట్రయల్స్ నిర్వహించామన్నారు. పిల్లల్లో వ్యాక్సినేషన్ సులభమని.. అదే పెద్దల్లో అయితే ఇది సవాల్‌తో కూడుకున్నదని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.
ఈ సదస్సులో కృష్ణ ఎల్లతో పాటు, బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేశ్ గోఖలే పాల్గొన్నారు.
కొవిడ్ పైనే ఫోకస్ చేయడం సమస్యే..
ప్రాంతాలకతీతంగా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ, ఆర్అండ్డీ సెంటర్లను అభివృద్ధి చేసుకోవాలని సౌమ్య స్వామినాథన్ సూచించారు. వ్యాక్సిన్ సప్లై చైన్ అంతా కొవిడ్-19 పైనే ఫోకస్ చేయటం సమస్యే అని.. కెపాసిటీ బిల్డింగ్, వాల్యూమ్ ఇంక్రీజింగ్ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని మహిమా దాట్ల తెలిపారు. భారత కంపెనీలు వ్యాక్సిన్లు, ఫార్మా ఉత్పత్తులతోపాటు.. కాంప్లెక్స్ జనరిక్స్, బయోసిమిలర్స్, బయోలాజిక్స్ వంటి అంశాలపై మరింత దృష్టిసారించాలని నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ సూచించారు. వ్యాక్సిన్ల అనుమతి ప్రక్రియలో ఆలస్యంపై బయోటెక్నాలజీ శాఖ సెక్రటరీ రాజేశ్ గోఖలే స్పందించారు. సమగ్రమైన డేటా, చట్టాలకు లోబడి చేయటం పనిచేయడం వల్లనే వ్యాక్సిన్ అనుమతుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. వెంచర్ కాపిటలిస్ట్ల మాదిరిగా వేగంగా అనుమతుల ప్రక్రియ జరగాలంటే సాధ్యపడదని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: Bio Asia Summit: హైదరాబాద్ వేదికగా...19వ బయో ఆసియా సదస్సు