గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పీఎస్‌లో రైతులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో రాజధాని రైతులకు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తమపై నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కృష్ణాయపాలేనికి చెందిన ఏడుగురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు సమంజసం కాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదించారు. పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే అంశాలేవీ లేవని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో పోలీసులు వ్యవహరించారని ధర్మాసనానికి తెలిపారు. గత నెల 23న మూడు రాజధానులకు అనుకూలంగా తాళ్లాయపాలెంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న వారిపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించారనే ఆరోపణతో రాజధాని ప్రాంతం రైతులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారు సైతం తన కంప్లైంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు పోలీసులకు రాతపూర్వకంగా సమర్పించారని ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం రైతులకు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: