సచివాలయంలో ఎనిమిది మంది ఉద్యోగులు చనిపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనాతో సాధారణ పరిపాలన శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కిషోర్ కుమార్ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. రెండోదశలో సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వందలాది మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ధ్వజమెత్తారు. ప్రజలు, ఉద్యోగులు కరోనాతో మరణిస్తున్నా.. ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆక్షేపించారు. సచివాలయ ఉద్యోగులందరికీ ఇంటినుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'కరోనా అనుమానంతో ఆసుపత్రికి వెళ్తే.. కాటికి పంపారు'