APTF on PRC: పీఆర్సీ పై మంత్రుల కమిటీతో శనివారం రాత్రి పీఆర్‌సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. మంత్రుల కమిటీతో చేసుకున్న ఒప్పంద పత్రాలను దహనం చేశారు. ఫిట్‌మెంట్ పెంపు లేకుండానే ఒప్పందం చేసుకున్నారని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల పాదాల ముందు దళారి నాయకులు ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారులను నమ్మించి సాధన సమితి నాయకులు మోసం చేశారని పేర్కొన్నారు. సమ్మె విరమణ నిర్ణయం సమంజసం కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా మంత్రుల కమిటీతో ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు.
లాలూచీ పడ్డారు..
‘ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి లొంగిపోయారు.. నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు’ అని అంటూ విశాఖ జిల్లా చోడవరంలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం నిరసన తెలిపారు.‘అమ్ముడుపోయారు.. అన్యాయం చేశారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- నర్సీపట్నంలో ఆర్డీవో కార్యాలయం లోపల వేతన ప్రతులను దహనం చేశారు. అనకాపల్లి, పాడేరు పట్టణాల్లోనూ ఏపీటీఎఫ్ నాయకులు చర్చల ఒప్పంద పత్రాలు దహనం చేశారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మోసూరి మహలక్ష్మినాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం కన్నా పీఆర్‌సీ సాధన సమితి నాయకులే ఉద్యోగులను ఎక్కువగా ద్రోహం చేశారని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
మోసం చేశారు..
- గుంటూరులోని ఏపీటీఎఫ్ కార్యాలయం ఎదుట మంత్రుల కమిటీ ఒప్పంద పత్రాలను ఉపాధ్యాయులు దహనం చేశారు.
- రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా సమ్మె విరమించిందంటూ నెల్లూరులో కోర్టు ఉద్యోగి కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
దిష్టిబొమ్మల దహనం
- చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఆదివారం భాకరాపేటలో నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రం చిత్తూరులోని ఎన్జీవో భవనంలో పీఆర్సీ సాధన సమితి జిల్లా నాయకులు రాఘువులు, గంటా మోహన్ తదితరులు సమావేశమయ్యారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకుంటేనే చర్చలకు వస్తామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఏకంగా సమ్మె విరమణకు పిలుపునివ్వడమేంటన్నారు. నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తిరుపతిలో ఏపీ సీపీఎస్ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాలుగు జేఏసీల నాయకులు ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పణంగా పెట్టాôటూ మదనపల్లె డివిజన్ జేఏసీ సెక్రటరీ జనరల్ రవి ప్రకాష్, కో- ఛైర్మన్ వెంకట రమణ రాజీనామా చేశారు.
- ప్రకాశం జిల్లా పొదిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. ఐకాస నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- కడప జిల్లా పోరుమామిళ్లలోని గిరినర్‌లో ఐకాసల ఛైర్మన్ల శవయాత్రను నిర్వహించారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయిన నాయకులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఏపీ ఐకాసకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా
ఏపీజేఏసీ పదవులకు.. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేశారు. ఉద్యోగుల ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆశలను ఏపీ జేఏసీ వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఐకాస నాయకత్వ వైఖరికి నిరసనగా ఐకాసలోని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఐకాసఛైర్మన్ బండి శ్రీనివాసరావుకు లేఖ రాశారు.
ఛలో విజయవాడ సహా ఉద్యోమ కార్యాచరణలో ఏపీటీఎఫ్ తీవ్రమైన కృషి చేసిందన్నారు. ఎలాంటి ఫలితాలూ రాకుండానే పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యమాన్ని విరమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీరింగ్ కమిటీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదని.. పీఆర్సీ ముగిసిన అధ్యాయమని ప్రభుత్వం ప్రకటించి అవమానించిందన్నారు.
నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు..
ఫ్యాప్టో ఆధ్వర్యంలోని 12 సంఘాలు నేటి నుంచి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరప్రసాదరావు వెల్లడించారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కానున్నట్లు, శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు.