AP State wide protest: దేశవ్యాప్త సమ్మెలో తొలి రోజు ఏపీ, మరికొన్ని రాష్ట్రాలు మినహా పలుచోట్ల పాక్షిక స్పందనే కనిపించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కార్మిక సంఘాలు దునుమాడుతూ.. రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టాయి. నిత్యావసర, ఇంధన ధరల పెరగుదలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసన ర్యాలీల్లోవామపక్ష, కార్మిక, కర్షక సంఘాలు పెద్దఎత్తున పాల్గొన్నాయి.
AP State wide protest: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కృష్ణాజిల్లా నందిగామలో నగర పంచాయతీ, అంగన్వాడీ ఉద్యోగులు ఆశ వర్కర్లు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు సమ్మె చేశారు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. మైలవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కనీస వేతన చట్టం అమలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్లతో ర్యాలీ చేపట్టారు.
కైకలూరులో... కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కైకలూరు ఎల్ఐసి ఆఫీస్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తక్షణం అదుపు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
గుంటూరులో... సార్వత్రిక సమ్మె సందర్భంగా గుంటూరులో కార్మికులు, ఉద్యోగులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వేంకటేశ్వ విజ్ఞాన మందిరం నుంచి శంకర్ విలాస్ కూడలి మీదుగా లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని... నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. రైతులకు కనీస మద్ధతు ధరను గ్యారంటీ చేస్తూ చట్టం చేయాలని.. 2021 విద్యుత్తు బిల్లు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని.. కనీస వేతనాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు.
పాడేరులో... కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బంద్ పాడేరులోనూ కొనసాగుతోంది. ఆర్టీసీ కూడలి వద్ద నిరసనకారులు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు . నిరసనకారులు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విజయనగరంలో... దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయనగరంజిల్లా వ్యాప్తంగా కార్మికులు ఉద్యమించారు. ప్రతి మండల కేంద్రంలోనూ కేంద్రప్రభుత్వ కార్మికుల చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా విజయనగరంలో ఇప్టూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై., భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇప్టూ ఆధ్వర్యంలో ద్విచక్ర, ఏఐటీయూసీ సమక్షంలో కార్మికులు కాలినడకన భారీ ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలోని అమర్ భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ., కోట, గంటస్తంభం, రైల్వేస్టేషన్ బస్టాండ్ కూడలి మీదుగా అమర్ భవన్ వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ., కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం., కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ., కార్మికుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తప్పుపట్టారు. అదేవిధంగా., ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణకు పూనుకోవటంపై మండిపడ్డారు.
నర్సీపట్నంలో... దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా... విశాఖ జిల్లా నర్సీపట్నంలో... వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా.. నిరసన ర్యాలీ చేపట్టి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా, వ్యాపార సంస్థలను మూసివేశారు. బంద్ నేపథ్యంలో... ఆర్టీసీ కాంప్లెక్స్ వెలవెల బోయింది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూతడ్డాయి.
పశ్చిమగోదావరిలో... రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా... పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టణ ప్రధాన రహదారుల్లో కేంద్ర ప్రభుత్వానికి, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర, ఇంధన ధరలు తగ్గించి.. కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా పాక్షిక స్పందన
దిల్లీ: దేశవ్యాప్త సమ్మెలో తొలి రోజు ఏపీ, మరికొన్ని రాష్ట్రాలు మినహా పలుచోట్ల పాక్షిక స్పందనే కనిపించింది. విద్యుత్తు సరఫరా, ఇతర నిత్యావసర సేవలకు ఆటంకాలు కలగలేదు. ప్రైవేటు బ్యాంకులు అన్ని చోట్లా నిరాటంకంగా పనిచేశాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, హరియాణాలలో బంద్ ప్రభావం ఉందని కార్మికసంఘాల ఉమ్మడి ఫోరం తెలిపింది. ఒక్క తమిళనాడులోనే సుమారు 50వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని చెప్పింది.
ఇదీ చదవండి: పాత గాజువాక జంక్షన్‌లో తెదేపా-వైకాపా నాయకుల ఘర్షణ...తోపులాట