పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ విడివిడిగా కలిశారు. ఉదయం 10.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను ఎస్ఈసీ రమేశ్ కుమార్ కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు నిమ్మగడ్డ వివరించారు. పలువురు ఐఏఎస్‌లు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని వివరించారు. అలాగే ఎన్నికలకు పూర్తిస్థాయి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఆదేశించాలని గవర్నర్‌ను ఎస్ఈసీ కోరినట్లు తెలిసింది. వీటితో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపునకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సామరస్య పూర్వకంగా ముందుకు వెళ్లాలని నిమ్మగడ్డకు గవర్నర్ సూచించినట్లు తెలిసింది. 45 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది.
ఎస్ఈసీ వెళ్లిపోయాక గవర్నర్‌ను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ఆయన వివరించారు. ఎస్ఈసీతో సామరస్య పూర్వకంగా వ్యవహరిస్తూ ప్రశాంతంగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను గవర్నర్ ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వం, ఎస్‍ఈసీ మధ్య అంతరం తగ్గించుకుని... ఇద్దరూ పరస్పరం సహకరించుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హితవు పలికినట్లు సమాచారం.
ఇదీ చదవండి: