విశాఖ జిల్లా ఎండాడ గ్రామంలో ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన వేలం ప్రకటనపై హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా ఎండాడ గ్రామం సాగరిక టౌన్ షిప్ పరిధిలోని 22 వేల 264 చదరపు గజాలు ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు ఏపీ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ మే 5న వేలం ప్రకటన జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు.
ఈ పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టగా.. రాజీవ్ స్వగృహ పథకం ఉద్దేశాలకు విరుద్ధంగా స్వగృహ కార్పొరేషన్ వ్యవహరిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వేలం స్వగృహ పథకం ఉద్దేశాలకు విరుద్ధం అన్నారు. కార్పొరేషన్ ద్వారా భారీగా నిధులను సమకూర్చుకునేందుకు ఈ వేలం నిర్వహిస్తున్నారన్నారు. ఈ వేలం ప్రక్రియ కొనసాగితే ప్రజలకు నిరాశే మిగులుతుందన్నారు. వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును ఎందుకు వినియోగిస్తారనే విషయాన్ని కార్పొరేషన్ వెల్లడించలేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నేలం ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: