రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించలేకపోతే.. అది అప్రజాస్వామికం అవుతుందని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఇవాళ జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ ఉమాదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం పోలీసులు నిర్భందించిన వ్యక్తిని 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. చాలా కేసుల్లో అలా జరగడం లేదని... రోజుల తరబడి సామాన్యులను విచారణ పేరిట తమ నిర్భంధంలో ఉంచడం పోలీసులకు సాధారణమైన అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించింది.
హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలైన తర్వాత మూడు నాలుగు రోజులకు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారంటూ న్యాయవాదులు... హైకోర్టుకు వివరించారు. పోలీసుల తరపు కౌన్సిల్ చేసిన వాదనలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా అయితే హెబియస్ కార్పస్ కేసు సీబీఐతో విచారణ చేయించాల్సి వస్తుందని... విజయవాడలో సీబీఐ తమ కార్యాలయం తెరవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగ సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తే ఎలా అని.. ప్రశ్నించింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడలేకపోతే వారు ఎక్కడికి వెళ్లాలని హైకోర్టు నిలదీసింది. ఈ కేసును సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం... ప్రభుత్వం వాయిదాలు తీసుకుంటూ త్వరగా విచారణ జరగకుండా చూస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: