2018లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి జవాబు పత్రాలను మొదట డిజిటల్ విధానంలో దిద్దారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలతో మరోసారి చేతితో దిద్దారు. డిజిటల్ మూల్యాంకనలో 326 మంది అభ్యర్థులు ఇంటర్వూలకు అర్హులుగా ఏపీపీఎస్ తేల్చింది. ఆ తర్వాత చేతితో దిద్దిన మూల్యాంకనంలో 326 మందిలో 202 మందిని అనర్హులుగా నిర్ణయించారు. ఇంత పెద్దమొత్తంలో అంత పెద్ద మొత్తంలో అనర్హులను చేయడం వెనుక అక్రమాలు చోటు చేసుకున్నాయని.. నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు ఏపీపీఎస్ అక్రమాలకు పాల్పడిందని అభ్యర్థుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. చేతితో దిద్దిన మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. నచ్చినవారిని ఎంపిక చేసుకోవడం కోసం తప్పుడు ఓఎంఆర్ షీట్లను జవాబుపత్రాలతో జతచేశారని కోర్టుకు తెలిపారు.
చేతితో పేపర్లు దిద్దాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించిన తర్వాత గతేడాది డిసెంబర్‌లోనే మూల్యాంకనం చేసినా ఆ ఫలితాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించలేదని పిటిషనర్లు వాదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి జవాబుపత్రాలను మూల్యాంకనం చేయించిందని తెలిపారు. అందుకు రూ. 5కోట్లను సైతం చెల్లించిందని.. దీనికి సంబంధించిన బ్యాంకు చెక్కుల ఆధారాలున్నాయన్నారు. పైగా అనర్హులతో మూల్యాంకనం చేయించారని పత్రాలు దిద్దేందుకు 3 నుంచి 4 నెలల సమయం పట్టనుండగా, కేవలం 35 రోజుల్లోనే ముగించేశారన్నారు. నిబంధనల ప్రకారం రోజుకు 15 నుంచి 20 పత్రాలు మాత్రమే దిద్దాలని.. కానీ ఒక్కొక్కరు 80 పేపర్లు వరకు దిద్దారని వివరించారు. ఒకే జవాబుపత్రంలో భిన్నమైన చేతి రాతలున్నాయన్నారు.
డిజిటల్ విధానంలో పత్రాలను దిద్దిన వారెవరని గతంలో హైకోర్టు ప్రశ్నించగా.. ఆ విషయాలు గోప్యంమంటూ ఏపీపీఎస్ నివేదించింది. కానీ చేతితో పేపర్లు దిద్దే వారి పేర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు సైతం బహిర్గతం చేసిందన్నారు. దీంతో పేపర్లు దిద్దేవారిని అభ్యర్థులు ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జవాబు పత్రాలు దిద్దామని కమిషన్ చెబుతోందని.. ఆ వీడియో రికార్డులు, కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. 202 మందిని అనర్హులుగా చేయడం వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందన్నారు.
రాజ్యాంగబద్ధ సంస్థ దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని ఏపీపీఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంటర్వూకు అర్హత సాధించలేదని...ఏదో జరిగిపోయినట్లు ఆరోపించడం సరికాదన్నారు. ఇలా అయితే ఏ పరీక్షా తుది దశకు చేరదన్నారు. సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం రీకౌంటింగ్‌కు వీలుంది కానీ.. రీవాల్యూవేషన్‌కు వీల్లేదన్నారు. పిటిషనర్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పేపర్లు దిద్దిన 162 మందిలో 112 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, 50 మంది సీనియర్ లెక్చరర్లు ఉన్నారని తెలిపారు. వివిధ యూనివర్సిటీల వీసీలకు లేఖరాయగా.. మూల్యాంకనం చేసేవారిని వారే ఎంపికచేశారన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు మాత్రమే జరగబోతున్నాయని.. తుది ఎంపిక జరగడం లేదన్నారు. అలాంటప్పుడు ఇంటర్వ్యూ ప్రక్రియను నిలువరించాల్సిన అవసరం లేదని వాదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని.. జవాబుపత్రాలు, రికార్డులను కోర్టు ముందు ఉంచుతామని.. అయితే ఈ ప్రక్రియను కొనసాగనివ్వాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ వేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించారు. బుధవారం జరిగే ఇంటర్వ్యూ వ్యవహారంపై తగిన ఉత్తర్వులిస్తానని స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: