రాజధానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో రోజువారీ తుది విచారణ జరిగింది. రైతుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది బండారు ఆదినారాయణ వాదనలు వినిపించారు. శాసనమండలిలో సవివరమైన చర్చ చేయకుండా..,సెలెక్ట్ కమిటీ రిపోర్టు ఇవ్వకుండా తెచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం చెల్లదని ఆయన వాదించారు. ద్విసభ విధానం అమలులో ఉన్న ఏపీలో శాసనమండలి అభిప్రాయాలు వమ్ముచేసి తెచ్చిన రెండు చట్టాలు చెల్లవన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును నిర్దేశించిన కేంద్రం...ఇప్పుడు అమరావతి విషయంలో తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదన్నారు. లాండ్ పూలింగ్ ద్వారా రాజధాని అభివృద్దికి ప్రజల నుంచి ఇంతపెద్ద ఎత్తున భూ సమీకరణ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని ధర్మాసనానికి తెలిపారు.
లాండ్ పూలింగ్‌లో లోపాలు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే.., వాటిమీద చర్యలు తీసుకోవాలిగానీ, కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన తర్వాత రాజధాని మార్పు సబబు కాదన్నారు. ఒకవైపు రాష్ట్రాని ఆర్థిక వెసులుబాటు లేదంటూనే.., 3 రాజధానులకు నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తారన్నారు. రాజ్యం తాను చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తే ప్రజలకు భరోసా ఎవరు కల్పిస్తారని ఆదినారాయమ వాదించారు. సీఆర్డీఏ చట్టంలో లోపాలున్నాయని రద్దుచేసి రైతులకు ఇచ్చిన భరోసాను వమ్ము చేశారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు సంపూర్ణంగా మారితే భవిష్యత్‌కు భరోసా ఉండదని రైతుల తరపున వాదనలు వినిపించారు.
ఇదీచదవండి