ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తీసుకుంటోందని కొంత కాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఖజానా నిండుకోవడంతో ఏంచేయాలో పాలుపోక.. అప్పులతోనే బండి నడిపించాలని చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే.. ఏపీఎస్డీసీ ద్వారా సర్కారు రుణం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.
ఏపీఎస్డీసీ ద్వారా సర్కారు రుణం తీసుకోవడంపై.. ఎమ్మెల్యే వెలగపూడి, హిమబిందుతోపాటు మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదించారు. ఇలా తనఖా పెడుతూపోతే భవిష్యత్తులో పరిపాలనపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా.. రుణ అంశంలో గవర్నర్ పేరు ప్రస్తావించడం కూడా సరికాదని అన్నారు.
ప్రభుత్వ ఆస్తుల తనఖాపై గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సైతం పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆస్తులను తనఖా పెడుతోందని, కొన్ని ఆస్తులను మళ్లీ తనఖా పెట్టేందుకు యత్నిస్తోందని తెలిపారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు.. వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: